గోడ దూకి పారిపోయిన గురుకులం స్టూడెంట్లు

  • జనగామకు నడుచుకుంటూ వచ్చిన 19 మంది విద్యార్థులు
  • అక్కడే చదువుకుంటామని పట్టు  
  • తోటి స్టూడెంట్లు వేధించారనే...

జనగామ, వెలుగు : జనగామ జిల్లా పెంబర్తి జ్యోతిబా పూలే గురుకులంలో తోటి స్టూడెంట్లు వేధిస్తున్నారని ఎవరికీ చెప్పకుండా పలువురు స్టూడెంట్లు అర్ధరాత్రి గోడదూకి పారిపోయారు. స్టూడెంట్ల కథనం ప్రకారం. జనగామలోని రైల్వే ట్రాక్​సమీపంలో ఉన్న గురుకులంలో సంఖ్య ఎక్కువగా ఉందనే కారణంతో 19 మంది స్టూడెంట్లను కొద్ది రోజుల క్రితం పెంబర్తి సమీపంలోని జ్యోతిబా పూలే గురుకులానికి పంపారు. 

కానీ, అక్కడి స్టూడెంట్లు, టీచర్లు వీరిపై వివక్ష చూపడమే కాకుండా సూటిపోటి మాటలతో వేధించారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో విసిగిపోయిన పిల్లలంతా గురువారం అర్ధరాత్రి దాటాక ప్రహరీ గోడ దూకి బయటకు వచ్చారు. అక్కడి నుంచి నడుచుకుంటూ జిల్లా కేంద్రంలోని జ్యోతిబా పూలే గురుకులానికి చేరుకున్నారు. ఈ విషయం శుక్రవారం ఉదయం బయటకు పొక్కడంతో తల్లిదండ్రులు గురుకులం వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. 

పెంబర్తి నుంచి జనగామకు నేషనల్​ హైవే పై నుంచి నడుచుకుంటూ వచ్చారని, మధ్యలో ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులని మండిపడ్డారు. సదరు స్టూడెంట్లు మాత్రం తాము జిల్లా కేంద్రంలోని గురుకులంలోనే చదువుకుంటామని మొండికేశారు. పెంబర్తి గురుకులం టీచర్లు సదరు స్టూడెంట్లకు నచ్చజెప్పి తిరిగి తీసుకువెళ్లడంతో సమస్య సద్దుమణిగింది.