‘గుస్సాడి’ కళాకారుడు.. కనక రాజు కన్నుమూత

‘గుస్సాడి’ కళాకారుడు..  కనక రాజు కన్నుమూత

ఆసిఫాబాద్/జైనూర్, వెలుగు : గుస్సాడి కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత కనక రాజు చనిపోయారు. కొంతకాలంగా ఆస్తమాతో బాధపడుతున్న ఆయన శుక్రవారం సాయంత్రం సొంతూరులో తుదిశ్వాస విడిచారు. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా జైనూర్‌ మండలం మర్లవాయికి చెందిన కనక రాజు గుస్సాడి నృత్యంలో ప్రతిభ కనబర్చి ‘గుస్సాడి రాజు’గా గుర్తింపు పొందారు. 1980లో రిపబ్లిక్‌ డే రోజున ఢిల్లీలోని ఎర్రకోట వద్ద అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ సమక్షంలో గుస్సాడి నృత్యం ప్రదర్శించి ప్రధానితో ప్రశంసలు అందుకున్నారు. 

గుస్సాడి నృత్యంలో విశేష ప్రతిభ చూపడంతో 2021లో భారత ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించగా, రాష్ట్రపతి రామ్‌నాత్‌ కోవింద్‌ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. గుస్సాడి నృత్యాన్ని మరింత విస్తరించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా రూ. కోటి మంజూరు చేసింది. రాజు స్వగ్రామం మర్లవాయిలో గుస్సాడి శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి పలువురు ట్రైనింగ్‌ ఇచ్చారు. గుస్సాడి నృత్య ప్రాముఖ్యతపై గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించేవారు. 

సీఎం దిగ్ర్భాంతి

హైదరాబాద్‌, వెలుగు : గుస్సాడి నృత్య కళాకారుడు కనక రాజు మరణం పట్ల సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుస్సాడి నృత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు తెలంగాణ కళలను, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడిన కనక రాజు మరణం తీరని లోటని విచారం వ్యక్తం చేశారు.  గుస్సాడి నృత్య ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు, ఇతరులకు నేర్పించటంలోనూ కనక రాజు తన విశేష సేవలు అందించారని గుర్తు చేశారు. కనకరాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

మంత్రి సీతక్క సంతాపం

కనక రాజు మృతికి మంత్రి సీతక్క సంతాపం తెలిపారు. రాజు మృతితో గుస్సాడి నృత్యం పెద్ద దిక్కును కోల్పోయిందన్నారు. గుస్సాడి నృత్యానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారని కొనియాడారు. కనక రాజు లేకుండా గుస్సాడి నృత్యాన్ని ఊహించుకోవడమే కష్టమన్నారు. రాజు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.