- ‘గుస్సాడీ’ కనకరాజుకు పద్మశ్రీ
- ఎస్పీ బాలుకు పద్మవిభూషణ్, గాయని చిత్రకు పద్మభూషణ్
- జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు పద్మ విభూషణ్
- 2021 సంవత్సరానికి 119 మందికి పద్మ పురస్కారాలు
- ఏడుగురికి పద్మ విభూషణ్, 10 మందికి పద్మ భూషణ్, 102 మందికి పద్మశ్రీ
న్యూఢిల్లీ / హైదరాబాద్, వెలుగు: కుమ్రంభీం ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గుస్సాడీ డ్యాన్స్ మాస్టర్, స్కూళ్లో కుక్‌గా పనిచేస్తోన్న కనకరాజు పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. ఆ నృత్యానికి గుర్తింపు తెచ్చినందుకు గాను ఆర్ట్స్ విభాగంలో ఆయన్ను ఈ అవార్డుకు కేంద్రం సెలెక్ట్ చేసింది. అలాగే గానగంధర్వుడు బాల సుబ్రమణ్యం(తమిళనాడు)ను ఆయన మరణాంతరం పద్మ విభూషణ్‌తో గౌరవించింది. ప్రముఖ గాయని కేఎస్ చిత్రకు పద్మ భూషణ్ (కేరళ) ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురికి పద్మశ్రీ అవార్డు దక్కింది. వయొలిన్ విద్వాంసుడు అన్నవరపు రామస్వామి, మృదంగ విద్వాంసురాలు నిడుమోలు సుమతి, ప్రముఖ అవధాని, సాహితీవేత్త ఆశావాది ప్రకాశ్‌రావు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. 72వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్రం సోమవారం పద్మ అవార్డులను ప్రకటించింది. 2021 సంవత్సరానికి వివిధ రంగాలకు చెందిన 119 మంది ప్రముఖులను పురస్కారాలకు ఎంపిక చేసినట్లు కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ఇందులో పద్మ విభూషణ్‌కు ఏడుగురిని, పద్మభూషణ్‌కు 10 మందిని, పద్మ శ్రీకి-102 మందిని సెలెక్ట్ చేసినట్టు తెలిపింది. పురస్కారాలు పొందిన వారిలో 29 మంది మహిళలు, 10 మంది ఎన్నారైలు/ఫారినర్లు/పీఐవో/వోసీఐ, ఒక ట్రాన్స్ జెండర్ ఉన్నట్లు తెలిపింది. 16 మందిని వారి మరణాంతరం అవార్డులకు ఎంపిక చేశామంది. వీళ్లంతా మార్చి/ఏప్రిల్‌లో రాష్ట్రపతి భవన్‌లో జరిగే వేడుకల్లో ప్రెసిడెంట్ రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డులను అందుకోనున్నారు.
గొగొయ్, పాశ్వాన్‌లకు పద్మ భూషణ్
పబ్లిక్ అఫైర్స్ విభాగంలో జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు పద్మ విభూషణ్‌ను కేంద్రం ప్రకటించింది. ఇటీవలే తుది శ్వాస విడిచిన అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగొయ్, కేంద్ర మాజీ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్, గుజరాత్ మాజీ సీఎం కేశుభాయ్ పటేల్‌కు పబ్లిక్ అఫైర్స్ రంగంలో పద్మ భూషణ్ దక్కింది. మధ్యప్రదేశ్ నుంచి మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ (పబ్లిక్ అఫైర్స్) కూడా పద్మ భూషణ్‌కు ఎంపికయ్యారు. సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో నరేందర్ సింగ్ కపణి (అమెరికా), ఆర్ట్స్ విభాగంలో సుదర్శన్ సహో(ఒడిశా), ఆర్కియాలజీ విభాగంలో బిబి లాల్ (ఢిల్లీ), ఆధ్యాత్మిక రంగంలో మౌలానా వహీదుద్దీన్ ఖాన్ (ఢిల్లీ), మెడిసిన్ రంగంలో బెల్లె మోనప్ప హెగ్డే (కర్నాటక)లకు పద్మ విభూషణ్ పురస్కారాలు దక్కాయి. గుజరాత్‌కు చెందిన మహేశ్ భాయ్, నరేశ్ భాయ్‌లకు వారి మరణాంతరం ఆర్ట్స్ విభాగంలో జంటగా (ఒకే అవార్డు ఇద్దరికీ) పద్మశ్రీ ఇచ్చి కేంద్రం గౌరవించింది.
ఎర్రకోటపై కనకరాజు గుస్సాడీ ప్రదర్శన
కనకరాజు స్వగ్రామం కుమ్రంభీం ఆదిలాబాద్ జిల్లా జైనూరు మండలం మార్లవాయి. ఆదివాసీ సాంస్కృతిక వైభవం గుస్సాడీకి గుర్తింపు తెచ్చిన కనకరాజు.. తన కళను ఎంతో మందికి పంచారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో ఎన్నో ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న టైమ్‌లో
ఢిల్లీలోని ఎర్రకోటలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తన బృందంతో గుస్సాడి నృత్యాన్ని ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం టైమ్‌లోనూ ఎర్రకోటలో ప్రదర్శన ఇచ్చారు. ప్రస్తుతం ఆయన మార్లవాయి ఐటీడీఏ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆశ్రమ పాఠశాలలో కుక్‌గా పని
చేస్తున్నారు. కనకరాజుకు పద్మశ్రీ రావడం ఆదివాసీ సమాజానికి దక్కిన గౌరవమని ఆదివాసీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
For More News..