బిగ్ బ్రేకింగ్ : 8 మంది రైల్వే అధికారులను అరెస్ట్ చేసిన సీబీఐ

గుంతకల్లు రైల్వే డీఆర్‌ఎం కార్యాలయం వివిధ విభాగాల్లో సీబీఐ సోదాలు చేసింది.  రైల్వే డీఆర్‌ఎం వినీత్‌సింగ్‌ నివాసంలో తనిఖీలు పూర్తయ్యాయి.  సింగ్​ నివాసంలో భారీగా బంగారం, నగదు పట్టుబడింది. ఎనిమిది మంది సిబ్బందిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గుంతకల్లు డీఆర్‌ఎం వినీత్‌సింగ్‌, డీఎఫ్‌ఎం ప్రదీప్‌ బాబు, సిబ్బంది రాజు, ప్రసాద్‌, బాలాజీ సీబీఐ అదుపులో ఉన్నారు. నిందితులను వైద్య పరీక్షల నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం వారిని సీబీఐ కోర్టుకు తరలించనున్నారు. 

గుంతకల్లు డీఆర్‌ఎం కార్యాలయంలో భాగమైన ఆర్థిక విభాగంలో  పనిచేస్తున్న సిబ్బంది నివాస గృహాల్లో సికింద్రాబాద్‌కు చెందిన సీబీఐ అధికారులు తనిఖీలు చేశారు. ఆర్థిక విభాగంలో పని చేస్తున్న సీనియర్‌ డివిజన్‌ ఫైనాన్స్‌ మేనేజర్‌(డీఎఫ్‌ఎం) ప్రదీప్‌బాబుతో పాటు మరికొందరు సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు రావడంతో సీబీఐ అధికారులు గత మూడు రోజుల ( జులై 6 వ తేదీ నాటికి)  నుంచి గుంతకల్లులో మకాం వేశారు. కదిరి ప్రాంతంలో రైల్వే మోరీ పనులకు సంబంధించి ఆ ప్రాంతానికి చెందిన గుత్తేదారులకు పనిని అప్పగించడానికి ఉత్తర్వులు ఇచ్చేందుకు ప్రదీప్‌బాబుతో పాటు కొందరు సిబ్బంది డబ్బును డిమాండ్‌ చేసినట్లు సమాచారం.  దీంతో సీబీఐ అధికారులు తనిఖీ చేసి అక్రమాలకు పాల్పడుతున్న సిబ్బంది గృహాల్లో దాడి చేసి..భారీగా నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు.