నల్గొండ : రాష్ట్ర గవర్నర్ తమిళిసై గతంలో ఓ పార్టీ అధ్యక్షురాలిగా పని చేశారని, ఆ పార్టీ భావజాలాన్నే ఇప్పటికీ అనుసరిస్తున్నారని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గురువారం నల్గొండలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గవర్నర్ తన పరిధి దాటి మాట్లాడి గౌరవాన్ని పోగొట్టుకోవద్దని సూచించారు. కొంతమంది బాధ్యత లేకుండా విలీనం, విమోచనం అంటూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం భావ్యం కాదన్నారు. తెలంగాణ ఉద్యమం అంటే ఏంటో తెలియనివారు కూడా ఏదేదో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా పరేడ్‌గ్రౌండ్‌లో ప్రత్యేకంగా కార్యక్రమం చేపట్టి కేంద్ర ప్రభుత్వం దేశ సమైక్యతకు, ఫెడరల్వ్యవస్థకు తూట్లు పొడుస్తోందన్నారు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కలిసి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 16 నుంచి 18 వరకు జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆనాడు పోరాటంలో అసువులు బాసిన అమరులకు నివాళి అర్పిస్తున్నట్లు చెప్పారు.