గత పది సంవత్సరాలుగా అభివృద్దే ధ్యేయంగా కేసిఆర్ పనిచేస్తూ.. దేశానికి దశ దిశ చూపించారని మండలి ఛైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్ల మిర్యాలగూడలోని తన నివాసంలో గుత్తా మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మిర్యాలగూడలో సిఎం కేసీఆర్ ఏన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఈ సంక్షేమ కార్యక్రమాలు యదావిధిగా కొనసాగించాలనే తిరిగి మూడోసారి కేసిఆర్ ను ముఖ్యమత్రిని చేయాలని చెప్పారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 కు 12 స్థానాలు భారాస పార్టీ కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గోదావరి జలాలను పెద్ద దేవులపల్లి రిజర్వాయర్ లో కలిపి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే ఆలోచనలో కేసిఆర్ ఉన్నారని తెలిపారు. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ను త్వరలోనే పూర్తి చేస్తారని.. అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ లకు నిధులను మంజూరు చేసి యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయిస్తున్నారని చెప్పారు.
అమలు కాని వాగ్దానాలు చేస్తున్న ఇతర పార్టీల మాటలు ప్రజలు నమ్మవద్దన్నారు. రైతుబంధు పథకం దేశంలోనే ఆదర్శమని.. తెలంగాణ పథకాన్ని కేంద్రం కాపీ కొట్టిందని విమర్శించారు. అది కూడా రైతాంగానికి లబ్ధి చేకూరే విధంగా లేదన్నారు. రైతులు పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేసే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని.. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తూ దేశంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదర్శంగా ఉందని పేర్కొన్నారు.