మూసీ ప్రక్షాళనకు నల్గొండ ప్రజలు పోరాడాలి : గుత్తా సుఖేందర్ ‌‌‌‌‌‌‌‌రెడ్డి

మూసీ ప్రక్షాళనకు నల్గొండ ప్రజలు పోరాడాలి : గుత్తా సుఖేందర్ ‌‌‌‌‌‌‌‌రెడ్డి
  • జిల్లా ప్రజలు బాగుండాలంటే  మూసీ ప్రక్షాళన జరగాల్సిందే..
  • కేటీఆర్ ‌‌‌‌‌‌‌‌ అతి తెలివి ప్రదర్శించొద్దు
  • శాసనమండలి చైర్మన్ ‌‌‌‌గుత్తా సుఖేందర్ ‌‌‌‌‌‌‌‌రెడ్డి

నల్గొండ అర్బన్, వెలుగు : మూసీ ప్రక్షాళన కోసం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఏడు నియోజకవర్గ ప్రజలు పోరాడాలని శాసనమండలి చైర్మన్ ‌‌‌‌‌‌‌‌ గుత్తా సుఖేందర్ ‌‌‌‌‌‌‌‌ రెడ్డి పిలుపునిచ్చారు. నల్గొండలోని క్యాంప్ ‌‌‌‌‌‌‌‌ ఆఫీస్ ‌‌‌‌‌‌‌‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నానన్నారు. నల్గొండ జిల్లా ప్రజలు బాగుండాలంటే మూసీ ప్రక్షాళన జరిగి తీరాల్సిందేనని, ఈ విషయంపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. మూసీ ప్రక్షాళనపై మాజీమంత్రి కేటీఆర్ ‌‌‌‌‌‌‌‌ అతి తెలివి ప్రదర్శించొద్దని హితవు పలికారు.

మూసీ ప్రక్షాళనకు మాజీ ప్రధాని వాజ్ ‌‌‌‌‌‌‌‌పేయి హయాంలోనే బీజం పడిందని, అప్పట్లో కేంద్రం రూ.350 కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ ‌‌‌‌‌‌‌‌ కూడా మూసీ రివర్ ‌‌‌‌‌‌‌‌ ఫ్రంట్ ‌‌‌‌‌‌‌‌ పేరుతో ప్రణాళిక తీసుకొచ్చారని, మూసీ సుందరీకరణకు రూ.16,500 కోట్లతో ప్రపోజల్స్ ‌‌‌‌‌‌‌‌ పంపింది బీఆర్ ‌‌‌‌‌‌‌‌ఎస్సే అని చెప్పారు. మూసీ ప్రక్షాళన విషయంపై కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, బీఆర్ ‌‌‌‌‌‌‌‌ఎస్ ‌‌‌‌‌‌‌‌ చేస్తే సుందరీకరణ, కాంగ్రెస్ ‌‌‌‌‌‌‌‌ చేస్తే దోచుకోవడం అవుతుందా ? అని ప్రశ్నించారు. మూసీలోకి పరిశ్రమల వ్యర్థాలు రాకుండా చర్యలు తీసుకునేలా సీఎం రేవంత్ ‌‌‌‌‌‌‌‌రెడ్డితో మాట్లాడతానన్నారు.

ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. హైదరాబాద్ ‌‌‌‌‌‌‌‌లో అక్రమ నిర్మాణాలన్నీ బీఆర్ ‌‌‌‌‌‌‌‌ఎస్ ‌‌‌‌‌‌‌‌ హయాంలోనే జరిగాయన్నారు. దేశ భద్రతకు ఉపయోగపడే రాడర్ ‌‌‌‌‌‌‌‌ కేంద్రం ఏర్పాటు విషయంలో కూడా విమర్శలేనా ? రాడర్ ‌‌‌‌‌‌‌‌ కేంద్రం విషయంలో గతంలో జీవోలు ఇచ్చింది బీఆర్ ‌‌‌‌‌‌‌‌ఎస్సే అని స్పష్టం చేశారు.