తండ్రి బాటలోనే గుత్తా అమిత్ 

  • డెయిరీ డెవలప్​మెంట్​​కో‌‌-ఆపరేటివ్ ​ఫెడరేషన్​
  • చైర్మన్ గా నియామకంఉత్తర్వులు జారీ 
  • చేసిన ప్రభుత్వంరెండేళ్లపాటు పదవిలో కొనసాగనున్న అమిత్​

నల్గొండ, వెలుగు : తెలంగాణ డెయిరీ డెవలప్​మెంట్ కో–ఆపరేటివ్ ఫెడరేషన్ ​లిమిటెడ్ ​చైర్మన్​గా గుత్తా అమిత్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్లపాటు అమిత్​ చైర్మన్​ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్​ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్​ఇవ్వకపోవడంతో ఎంపీ ఎన్నికలకు ముందు అమిత్ కాంగ్రెస్​లో చేరారు. పార్టీలో చేరిక సందర్భంగా దీపాదాస్​మున్షీ, గుత్తా సమీప బంధువు, ప్రభుత్వ సలహాదారు వేంనరేందర్ రెడ్డితో అమిత్​ పొలిటికల్ ​కెరీర్​పై స్పష్టమైన హామీ ఇచ్చారు.

పార్టీలో చేరినప్పటి నుంచి అటు ప్రభుత్వం, ఇటు పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న అమిత్ ఇటీవల సీఎం రేవంత్​రెడ్డితో కలిసి అమెరికా వెళ్లొచ్చారు. కాగా, తన తండ్రి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి బాటలోనే అమిత్​పొలిటికల్​కెరీర్ ప్రారంభంకావడం విశేషం. ఉమ్మడి ఏపీలో గుత్తా సుఖేందర్​రెడ్డి టీడీపీ ప్రభుత్వంలో ఇదే తెలంగాణ డెయిరీ డెవలప్​మెంట్ ఫెడరేషన్​కు చైర్మన్ గా పనచేశారు. 1995 నుంచి 1999 వరకు చైర్మన్ గా వ్యవహరించిన గుత్తా, 1998లో నేషనల్ డెయిరీ డెవలప్​మెంట్ బోర్డుకు డైరెక్టర్​గా కూడా పనిచేశారు.

అంతకుముందు నల్గొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకారం సంఘం (మదర్ డెయిరీ) చైర్మన్​గా 1992 నుంచి 1999 వరకు సుదీర్ఘకాలం పాటు పనిచేశారు. గుత్తా స్వగ్రామం చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామ పాల ఉత్పత్తిదారుల సంఘానికి ఆయన చైర్మన్​గా పనిచేశారు. తర్వాత సుఖేందర్​రెడ్డి తమ్ముడు జితేందర్​రెడ్డి మదర్​ డెయిరీ చైర్మన్​గా చాలా కాలం పనిచేయగా, ఇప్పుడు మళ్లీ తండ్రి

బాబాయ్ బాటలోనే డెయిరీ ఫెడరేషన్​ చైర్మన్​గా అమిత్​ రాజకీయ అరంగ్రేటం చేయడం విశేషం. చైర్మన్​గా బాధ్యతలు చేపట్టిన అమిత్​ డెయిరీని లాభాలబాటలో నడిపించేందుకు కృషి చేస్తానన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్​రెడ్డి, సీనియర్​నేత జానారెడ్డికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.