మండలి రద్దు .. అసంబద్ధం.. అసలు అలాంటి పరిస్థితే లేదు

  •  2026లో పునర్విభజన చట్టం అమలు

  •  తెలంగాణలో 34, ఏపీలో 50 అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి

  •  రైతు భరోసా పదెకరాల వరకు ఇస్తే చాలు

  • ఆర్థిక పరిస్థితిపై ఇదివరకే సర్కారు శ్వేతపత్రం

  •  అనర్హత విషయంలో గతంలో మాదిరిగానే నిర్ణయాలు

  •  మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్  రెడ్డి

నల్లగొండ: శాసన మండలి రద్దు అనేది అసంబద్ధమని, అలాంటి  పరిస్థితే లేదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డ అన్నారు. 2026లో నియోజకవర్గాల పునర్విభజన చట్టం అమలవుతుందని, అప్పుడు తెలంగాణలో 36, ఆంధ్రప్రదేశ్ లో 50 అసెంబ్లీ సీట్లు పెరుగాయని చెప్పారు. ఇవాళ నల్లగొండలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు.  తెలంగాణలో ఆర్థిక పరిస్థితి బాగాలేదని 7లక్షల కోట్ల అప్పు ఉందని రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసిందని చెప్పారు. ఇలాంటి పరిస్థితిలో ఖర్చులు తగ్గించుకోవడం మంచిదని అన్నారు. 

రైతు బంధు , రైతు భరోసా కేవలం పది ఎకరాల వరకు ఇస్తే చాలని చెప్పారు. సేద్యం చేసే భూములకు మాత్రమే రైతు బంధు ఇవ్వాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం మంచిదేనని చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అనర్హత విషయంలో గతంలో మండలి చైర్మన్, స్పీకర్ గా వ్యవహరించిన వారు తీసుకున్నట్టుగానే తన నిర్ణయాలు కూడా ఉంటాయని చెప్పారు. శాసన మండలి చైర్మన్ హోదాలో ఉండి రాజకీయాల గురించి మాట్లాడనని అన్నారు. 

ALSO READ | తెలంగాణలో కాంగ్రెసోళ్లు పెద్ద మార్పే తెచ్చారు: కేటీఆర్

ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు భేటీ కావడం శుభపరిణామమని, చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. రెండు రాష్ట్రాల సీఎంల కలయికను అభివృద్ధి కోణంలోనే చూడాలని, అందులో రాజకీయ కోణం వద్దని అన్నారు.  సీఎం  ప్రతిపక్షాల బెదిరంపులకు అస్సలు భయపడ వద్దని, అప్పుడే అభివృద్ది చేసుకోగలుగుతామని అన్నారు. తెలంగాణకు నీళ్లు రావాలంటే ఎత్తిపోతలు మినహా మరో మార్గం లేదని అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్తికి సీఎం ఎంతో  ప్రయత్నిస్తున్నారని చెప్పారు. వచ్చే రెండేళ్లలో ఎస్ఎల్ బీసీ పెండింగ్ పనులు పూర్తి చేయాలని, తద్వారా నల్లగొండ జిల్లాలో సాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందని అన్నారు.  ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు చాలా కష్టపడుతున్నారని సుఖేందర్ రెడ్డి చెప్పారు. జిల్లాలో ఉన్న పెండింగ్ పనులన్నీ త్వరగా పూర్తి అవుతాయని అనుకుంటున్నామని తెలిపారు.