కొడుకు అమిత్ కోసమా? కాంగ్రెస్‌ను దెబ్బ తీసేందుకా?
- ఇన్నాళ్లూ ఎడమొహం, పెడమొహంగా ఉన్న లీడర్లు
- వీళ్లద్దరు కలువడంతో పార్టీకి మంచి జరుగుతుందని ఎమ్మెల్యేల ధీమా
- గ్రూప్ రాజకీయాలకు ఫుల్స్టాప్ పడినట్లే అంటున్న క్యాడర్
నల్గొండ, వెలుగు : శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, విద్యుత్ మంత్రి గుంట కండ్ల జగదీశ్‌రెడ్డి నడుమ దోస్తీ కుదిరింది. ఇన్నాళ్లూ ఎడమొహం, పెడమొహంగా ఉన్న వీళ్లద్దరి కలయిక చూసిన ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఒకింత ఆశ్చర్యానికి గురైనా.. పార్టీకి మంచి జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ పార్టీలో మండలి చైర్మన్ గుత్తాకు, మంత్రి జగదీశ్ రెడ్డికి మధ్య రాజకీయ విభేదాలు ఉన్నట్టు ఎప్పటి నుంచో ప్రచారం ఉంది.
ఇటీవల కాంగ్రెస్ సీఎల్‌పీ నేత మల్లు భట్టి విక్రమార్క జిల్లాలో చేపట్టిన పాదయాత్రలో వీళ్లిద్దరే లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం కడుపులో కత్తులో పెట్టుకుని గ్రూపు రాజకీయాలు పెంచి పోషిస్తున్నారని గుత్తా, మంత్రిని ఉద్దేశించి కామెంట్ చేశారు. దీంతో సీనియర్ల మధ్య ఉన్న పొలిటికల్గ్యాప్ప్రతిపక్ష పార్టీలకు అస్త్రంగా మారొద్దనే ఆలోచనతోనే ఏకతాటిపైకి వచ్చినట్లు తెలుస్తోంది.
గుత్తా వర్గం దారికొచ్చేనా..?
జిల్లాలో ఒకరిద్దరు మినహా ఎమ్మెల్యేలంతా మంత్రి జగదీశ్ రెడ్డి కోటరీగానే పనిచేస్తున్నారు. కానీ, నల్గొండ, మునుగోడు, దేవర కొండ, నాగార్జునసాగర్, కోదాడ నియోజకవర్గాల్లో గుత్తా వర్గం ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా పనిచేస్తోంది. దేవరకొండ, సాగర్, కోదాడ, మనుగోడులో అయితే పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. మంత్రి వచ్చినా దూరంగానే ఉంటోంది. నల్గొండలో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి రాజకీయ విభేదాల కారణంగా ప్రకాశం బజార్వ్యాపారులు రెండు గ్రూపులుగా చీలిపోవడంతో మడిగల పంచాయితీ ఎటూ తేలడంలేదు.
దేవరకొండ మున్సిపల్‌చైర్మన్ ఆలంపల్లి నర్సింహా, ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌కు అస్సలు పడట్లేదు. సాగర్‌లో ఎమ్మెల్యే భగత్, మంత్రి ప్రధాన అనుచరుడు ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. పలుమార్లు మంత్రి కలుగజేసుకొని నచ్చజెప్పేందుకు యత్నించినా.. ఫలితం కనిపించలేదు.
కొడుకు కోసమేనా?
మంత్రి జగదీశ్‌రెడ్డితో దోస్తీ వెనక బలమైన రాజకీయ కోణం కూడా ఉండొచ్చనే చర్చ జరుగుతోంది. గుత్తా కొడుకు అమిత్ రెడ్డి జిల్లా రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మునుగోడు, నల్గొండలో పోటీ చేయాలని భావిస్తున్నారు. ఒకవేళ ఎమ్మెల్యే ఛాన్స్ మిస్ అయినా నల్గొండ ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. దీని కోసమే రెండేళ్లుగా గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ పేరుతో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. హైకమాండ్ఆశీస్సులతోనే అమిత్ పొలిటికల్ఎంట్రీ ఇస్తున్నట్లు చెప్తున్నా.. మంత్రి సపోర్ట్ కూడా కీలకం కానుంది. ఇందులో భాగంగానే ఇటీవల అమిత్‌రెడ్డి ఎక్కడ పర్యటించినా మంత్రి పేరు ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు.
అమిత్ ఎంట్రీ ఇచ్చాక ఫస్ట్‌టైం జరిగిన మంత్రి బర్త్‌డే వేడుకులకు సొంత పత్రికలో పెద్దఎత్తున ప్రకటనలు ఇచ్చారు. ఇందులో గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు ఆయన ప్రధాన అనుచరుడు జడ్పీ ఫ్లోర్ లీడర్పాశం రాంరెడ్డి ఫొటో ఉండడం ఆసక్తికరంగా మారింది. సోమవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన మంత్రి బర్త్‌డే వేడుకలకు మండలి చైర్మన్ గుత్తా భార్య అరుంధతి, కొడుకు అమిత్ రెడ్డి, కోడలు అఖిలతో సహా అందరూ వెళ్లి విషెస్ చెప్పారు.
కాంగ్రెస్ దూకుడుకు కళ్లెం వేసేందుకే..
రేవంత్ నిరుద్యోగ సభ, భట్టి విక్రమార్క పాదయాత్ర, కర్నాటక ఎన్నికల ఫలితాలు జిల్లా కాంగ్రెస్‌లో కొత్త జోష్ నింపాయి. దీంతో కాంగ్రెస్సీనియర్లు ఏకతాటి పైకొచ్చి వచ్చే ఎన్నికల్లో 12 సీట్లు గెలుస్తామని చాలెంజ్‌చేశారు. గుత్తా, మంత్రి వీరికి దీటుగా విమర్శలు చేస్తున్నా.. ఎవరికివారే అన్నట్లుగా ఉండేది. మంత్రి జగదీశ్ రెడ్డి పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ కాంగ్రెస్ టార్గెట్‌గా కామెంట్లు చేస్తున్నారు. మండలి చైర్మన్హోదాలో ఉన్న సుఖేందర్ రెడ్డి ప్రెస్‌మీట్ల ద్వారా కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నారు.
అయినప్పటికీ కాంగ్రెస్ దూకుడుకు కళ్లెం పడే పరిస్థితి లేకపోవడంతో వీళ్లిద్దరు ఏకతాటి పైకి రావాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలిసింది. బీఆర్ఎస్ గ్రూపు పాలిటిక్స్ కాంగ్రెస్‌కు కలిసిరావొద్దనే ఉద్దేశం కూడా ప్రధాన కారణమని చర్చ జరుగుతోంది.