ప్రస్తుతం తెలంగాణలో రాయలసీమ వాతావరణం : గుత్తా సుఖేందర్​ రెడ్డి

  • ప్రస్తుతం తెలంగాణలో .. రాయలసీమ’ వాతావరణం
  • సీఎంతో అప్పుడున్నంత చనువు లేదు
  • నాకు ఇచ్చిన పోస్టు అట్లాంటిది
  • ఎంపీగా ఉన్నప్పుడే ఎక్కువ సార్లు కలిసినా 
  • మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డి

నల్గొండ, వెలుగు : ‘ సీఎం అయ్యాక కేసీఆర్​ను నేను కలిసిన సందర్భాలు చాలా తక్కువ. ఎంపీగా ఉన్నప్పుడే ఎక్కువ సార్లు కలిసినా. ఆయనతో అప్పుడున్నంత చనువు ఇప్పుడు లేదు. ఎందుకంటే కేసీఆర్​ నాకు ఇచ్చిన పోస్టు అట్లాంటిది. అయినప్పటికీ మాపార్టీలో కొందరికి నా పై ఈర్ష్యా ద్వేషాలున్నాయి. దాంతో నాపై అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేశారు’ అని మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 

బుధవారం నల్గొండలో మీడియా చిట్​చాట్​లో ఆయన మాట్లాడారు. ‘నేను వ్యతిరేకంగా పని చేసి, పంచాయితీలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పెద్దమనిషిలాగా హుందాతనంగా, గౌరవప్రదంగా రాజకీయాల నుంచి రిటైర్​అవ్వాలని కోరుకుంటున్నా. దీన్ని అవతలి వాళ్లు కూడా అర్థం చేసుకుంటే మంచిది’ అని అన్నారు. ఉమ్మడి జిల్లా అధికారుల బదిలీలు, పరిపాలన వ్యవహారాల్లో తన ప్రమేయం ఉండదని, అంతా మంత్రి, ఎమ్మెల్యేలే చూసుకుంటారన్నారు. అయినా కొందరికి తనపై లేనిపోని అనుమానాలు, అపోహలు ఉన్నాయన్నారు. 

పార్టీ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థులు నచ్చినా, నచ్చకపోయినా కలుపుకోవాల్సిందేనన్నారు. తన 40 ఏండ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఎమ్మెల్యేల మేలు కోసం మంచి, చెడుల గురించి చెప్తానని, కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అర్థం చేసుకోకుండా కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారన్నారు. తనను మళ్లీ గెలిపిస్తే ఇబ్బంది పెడతాడనే రీతిలో ఎమ్మెల్యేల ప్రవర్తన ఉందన్నారు. తన రాజకీయ జీవితంలో గ్రూపు రాజకీయాలకు ఛాన్స్​ ఇవ్వలేదని, ఒక్క పోలీస్​ కేసు కూడా నమోదు కాలేదని ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా పనిచేశానని వివరించారు. కానీ, ఇప్పటి రాజకీయ నాయకుల్లో ఓపిక తగ్గిపోయిందని, తాత్కాలిక ప్రయోజనాలు ఆశించి రాజకీయాలు చేస్తున్నారన్నారు. రాయలసీమ తరహా వాతావరణం ఇప్పుడిప్పుడే తెలంగాణలో కనిపిస్తోందని, అలాంటిది మంచిది కాదన్నారు.