ఎంపీగా పోటీ చేస్త..పార్టీ మారాల్సిన అవసరం నాకు లేదు

నల్గొండ, వెలుగు:  పార్టీ హైకమాండ్ ఒప్పుకుంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తాను లేదంటే తన కొడుకు అమిత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఎంపీగా పోటీ చేస్తామని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. పార్టీ మారే ఆలోచనే తనకు లేదని స్పష్టం చేశారు. బుధవారం నల్గొండలో మీడియాతో ఆయన మాట్లాడారు. కొంతమంది తమ తప్పిదాలను ఇతరులపై నెడతారని, అందులో భాగంగానే తనపైనా నెట్టారని, తన స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గతంలోనూ తన రాజకీయ జీవితంలో ఇలాంటివి అనేకం జరిగాయని, ఎవరెన్ని చేసినా తన పని తాను చేసుకుపోయానన్నారు. ఇకపైనా అలాగే ఉంటానని, ఇప్పుడు పార్టీ మా రాల్సిన అవసరం తనకు లేదన్నారు. 

కొంతమంది నేతలు సొంత పార్టీ వారిపైనే విమర్శలు, ఆరోపణలు చేయడం కొత్తగా ట్రెండ్‌‌గా మారిందన్నారు. రాష్ట్ర భవిష్యత్తును, కేసీఆర్‌‌ను దృష్టిలో పెట్టుకొని అంతా కలిసి పనిచేయాలన్నారు. ఎమ్మెల్యేలతో విభేదాల కారణంగానే తనతో ఉన్న కొంతమంది పార్టీ విడిపోతున్నారని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యేలు తమకున్న భేదాభిప్రాయాల దృష్ట్యా తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే మళ్లీ కేసీఆర్ సీఎం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 స్థానాల్లో బీఆర్‌‌ఎస్‌‌ అభ్యర్థులు విజయం సాధిస్తారన్నారు. మేడిగడ్డ బ్యారేజీ విషయంలో రాజకీయం చేయడం మంచిది కాదని అన్నారు.