ఎస్ఎల్ బీసీపై రాజకీయం సరికాదు : గుత్తా సుఖేందర్ రెడ్డి

ఎస్ఎల్ బీసీపై రాజకీయం సరికాదు : గుత్తా సుఖేందర్ రెడ్డి
  • ఎన్ని అడ్డంకులొచ్చినా ప్రాజెక్టును పూర్తి చేస్తాం: గుత్తా 
  • టన్నెల్ వయెబుల్ కాదంటే..బీఆర్ఎస్ హయాంలోనూఎందుకు పనులు చేశారని ప్రశ్న

హైదరాబాద్, వెలుగు:   ఎస్ఎల్ బీసీ టన్నెల్ ప్రమాద ఘటన దురదృష్టకరమని, ఇందులో ప్రభుత్వ నిర్లక్ష్యం ఏమాత్రం లేదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఈ ప్రమాదంపై రాజకీయాలు చేయడం సరికాదన్నారు. శుక్రవారం శాసన మండలి ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. టన్నెల్ ప్రమాద ఘటనపై సర్కారు నిర్లక్ష్యం చూపిందనడంలో వాస్తవం లేదన్నారు.

.సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు అక్కడికి చేరుకొని అన్ని శాఖలను సమన్వయం చేసి సహాయక చర్యలను పర్యవేక్షించారని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎమర్జెన్సీ బృందాలు సహాయక చర్యలు మొదలుపెట్టాయని, రెస్క్యూ ఆపరేషన్ లో కేంద్ర బలగాలు కూడా నిరంతరం శ్రమించాయని తెలిపారు.

కేంద్రం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయక చర్యలు చేపట్టిందన్నారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో జరిగే ఘటనలను ప్రమాదాలుగానే చూడాలని, ఇలాంటి వాటిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్​రావు రాజకీయం చేయడం సరికాదన్నారు.

‘‘ఎస్ఎల్ బీసీ టన్నెల్ వయెబుల్ కాదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఎట్లా అంటారు? వయెబుల్ కాదనుకుంటే వారి హయాంలో రూ.3,600 కోట్లు ఈ టన్నెల్ పై ఎందుకు ఖర్చు పెట్టారు?” అని గుత్తా ప్రశ్నించారు. గతంలో  కాళేశ్వరం, శ్రీశైలం పవర్ ప్రాజెక్టులో కూడా ప్రమాదాలు జరిగాయని, పెద్ద ప్రాజెక్టులు కట్టేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుందన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎస్ఎల్ బీసీని పూర్తి చేసి తీరతామన్నారు.