- సర్దిచెప్పి పంపించిన పోలీసులు
ములుగు, వెలుగు: గట్టమ్మ తల్లి వివాదం ముదురుతోంది. జాకారం జీపీకి, నాయకపోడ్ పూజారుల మధ్య ఉన్న వివాదంలోకి ముదిరాజ్ లు ఎంటర్ కావడంతో రెండు వర్గాల మధ్య గొడవగా మారి పోయింది. ఆదివాసీ నాయకపోడ్ లు వారి కులదైవంగా భావించి నిత్యం పూజలు చేస్తున్నారు. అయితే గట్టమ్మ ఆలయం జాకారం జీపీ పరిధిలోకి వస్తుందని తామే అసలైన పూజారులంటూ ఆలయాన్ని స్వాధీనం చేసుకునేందుకు ముదిరాజ్లు ఇవాళ తరలివచ్చారు.
విషయం తెలిసిన నాయకపోడ్లు గట్టమ్మ ఆలయం వద్దకు వచ్చారు. ఆలయంలో గట్టమ్మ తల్లి విగ్రహం వద్దకు ముదిరాజ్ మహిళలు పూజారులమంటూ నాయకపోడ్ మహిళలతో గొడవకు దిగారు. దీంతో తీవ్ర వాగ్వివాదం నెలకొంది. ఇరువర్గాలు కొట్టుకోవడంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.
ములుగు డీఎస్పీ రవీందర్, సీఐ రంజిత్ కుమార్ ఆలయం వద్దకు చేరుకొని గొడవను ఆపివేశారు. ఆలయం వివాదం తేలేవరకు గొడవలకు దిగొద్దని, కవ్వింపు చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు. కాగా, గాయపడ్డ వారిని ములుగు ఆస్పత్రికి తరలించారు.