పన్ను వసూళ్లలో టార్గెట్‌‌ను చేరుకోవాలి : షేక్‌‌ రిజ్వాన్‌‌ బాషా

వరంగల్‌‌ సిటీ, వెలుగు : పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టి రోజువారీ టార్గెట్‌‌ను చేరుకోవాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌‌ షేక్‌‌ రిజ్వాన్‌‌ బాషా ఆదేశించారు. నగరంలోని రెవెన్యూ కాలనీ, రామాలయం వీధిలో బుధవారం నిర్వహించిన పన్నుల వసూళ్లను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌‌ మాట్లాడుతూ టార్గెట్‌‌ చేరుకోలేని రెవెన్యూ సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రాపర్టీ ట్యాక్స్‌‌తో పాటు, వాటర్‌‌ ట్యాక్స్‌‌పై శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఎక్కువ మొత్తంలో పెండింగ్‌‌ ఉన్న వారిపై ఫోకస్‌‌ చేయాలని చెప్పారు.

ఆయన వెంట ఆర్‌‌వో సుదర్శన్, ఆర్‌‌ఐ రజనీ ఉన్నారు. అనంతరం డిప్యూటీ కమిషనర్లు, రెవెన్యూ ఆఫీసర్లతో టెలీకాన్ఫరెన్స్‌‌ నిర్వహించారు. అలాగే భద్రకాళీ బండ్‌‌పై కొనసాగుతున్న పనులను పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. బ్యూటిఫికేషన్‌‌, లైటింగ్‌‌, శానిటేషన్‌‌, పచ్చదనం పెంపు, నిర్వహణ పనులు సక్రమంగా సాగడం లేదని అసహనం వ్యక్తం చేశారు. నిర్వహణ సంస్థ సుచిర్‌‌ ఇండియాపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట కుడా సీపీవో అజిత్‌‌రెడ్డి, హెచ్‌‌వో వేణుగోపాల్, ఈఈ భీమ్‌‌రావు, డీఈ రఘు పాల్గొన్నారు.