- బీఆర్‍ఎస్ ఆఫీస్ స్థలంలో.. అక్రమ నిర్మాణాల కూల్చివేత
- పార్టీ పేరుతో స్థలం తీసుకొని షాప్స్ కట్టి రెంట్కిచ్చే యత్నం
- కట్టడాలను జేసీబీలతో నేలమట్టం చేసిన అధికారులు
- స్థానికుల ఫిర్యాదులు, వెలుగు’ కథనానికి స్పందన
వరంగల్/ఖిలా వరంగల్, వెలుగు: వరంగల్ జిల్లా బీఆర్‍ఎస్ పార్టీ పేరుతో తీసుకున్న స్థలంలోని అక్రమ నిర్మాణాలను శనివారం రెవెన్యూ, గ్రేటర్ వరంగల్కార్పొరేషన్ అధికారులు కూల్చివేశారు. పోలీస్ బందోబస్తు మధ్య పొద్దున్నే బుల్డోజర్లతో వచ్చిన ఆఫీసర్లు నిమిషాల వ్యవధిలో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. గ్రేటర్ వరంగల్ 42వ డివిజన్ పరిధి వరంగల్ – ఖమ్మం హైవేలోని నాయుడు పెట్రోల్ బంక్ జంక్షన్లో ఆఫీస్ పేరుతో బీఆర్‍ఎస్ పార్టీ స్థలం తీసుకుంది. సర్వే నంబర్140లోని పుల్లయ్యకుంటలో గజం ధర రూ.50 వేలకుపైగా డిమాండ్ ఉంది.
అప్పటి బీఆర్‍ఎస్ వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాత్రం ఆఫీస్ నిర్మాణం పేరుతో ఎకరం స్థలాన్ని కేవలం రూ.100 గజం చొప్పున అప్పనంగా పొందారు. సొంత పార్టీ అధికారంలో ఉండటంతో అప్పటి ప్రభుత్వంలోని సీఎస్ సోమేశ్ కుమార్ ఈజీగా జీఓలు ఇచ్చేశారు. మే20న కేటీఆర్ ఆఫీస్ భూమి పూజ చేయడానికి వస్తున్నారనే సమాచారంతో మే11న రూ.100 గజం చొప్పున ఎకరం కమర్షియల్ ల్యాండ్ కేటాయించారు. పనిలోపనిగా పక్కనే ఉన్న పుల్లయ్యకుంట చెరువును సైతం గులాబీ లీడర్లు మొరంతో నింపి కబ్జా చేశారు.
ఆఫీస్ ప్లేసులో.. కమర్షియల్ షాప్స్
గత మే 20న అప్పటి మంత్రి కేటీఆర్ వరంగల్ జిల్లా బీఆర్‍ఎస్ పార్టీ ఆఫీస్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. స్థలం కేటాయింపు, చెరువు పూడ్చివేత వివాదస్పదమైనప్పటికీ ఆయన కార్యక్రమానికి హాజరయ్యారు. దీనిపై అప్పట్లో విమర్శలొచ్చాయి. ఇదంతా జరిగి దాదాపు10 నెలలు అవగా.. ఇప్పటికీ ఆఫీస్‍కు సంబంధించి ఎలాంటి పనులు మొదలు పెట్టలేదు. అదే సమయంలో ఈ స్థలంలో రెండు కమర్షియల్ షాపుల నిర్మాణం జరిగింది. దీనికి ‘టు లెట్’ బోర్డ్పెట్టారు. దాన్ని చూసిన స్థానికులు విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
స్థలం ఇవ్వడం వరకే తమ బాధ్యత అని, నిర్మాణాలతో సంబంధం లేదన్నట్లుగా రెవెన్యూ అధికారులు సమాధానమిచ్చారు. దీంతో స్థానిక సోషల్ యాక్టివిస్ట్ ఫసి, చెరువుల పరిరక్షణ కమిటీ సభ్యుడు లక్ష్మణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోట్లాది రూపాయల ప్రభుత్వ స్థలాన్ని బీఆర్‍ఎస్ నేతలు చౌకగా పొందడం, అది కూడా కబ్జాకు గురికావడంపై ‘వీ6 వెలుగు’ ఈ నెల 25న ‘బీఆర్‍ఎస్ ఆఫీస్ పేరుతో కమర్షియల్ షాపులు’ హెడ్డింగ్‍తో మెయిన్ ఎడిషన్లో వార్త ప్రచురించింది. దీంతో తెల్లారే అధికారుల బృందం ఘటనా స్థలానికి చేరుకుని కబ్జాలను గుర్తించింది.
గ్రేటర్ కార్పొరేషన్ కమిషనర్ రిజ్వాన్ బాషా, సీపీవో వెంకన్న నేతృత్వంలో టౌన్ ప్లానింగ్, టాస్క్ఫోర్స్అధికారులు శ్రీనివాస్‍రెడ్డి, ఖలీల్, శ్రీనివాస్, సుష్మా, బషీర్‍ల బృందం శనివారం ఉదయమే జేసీబీలను పెట్టి అక్రమ నిర్మాణాలను కూల్చేశారు. కాగా, కబ్జాలపై బల్దియా అధికారులు స్పందించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. అదేసమయంలో కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వానికి చెందిన ఎకరం స్థలాన్ని పరిరక్షించాలని వారు కోరుతున్నారు.