
న్యూఢిల్లీ: కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) గా జ్ఞానేశ్ కుమార్ బుధవారం ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు వేస్తేనే జాతి నిర్మాణం సాధ్యం అవుతుందన్నారు. 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్క దేశ పౌరుడూ ఓటరుగా నమోదు చేసుకోవాలని, అక్కడితో ఆగకుండా ప్రతి ఎన్నికలోనూ ఓటు వేయాలని ఆయన సూచించారు. ‘‘రాజ్యాంగానికి అనుగుణంగా ఎన్నికల సంఘం పనిచేస్తుంది. ఈసీ ఎప్పడూ దేశ ప్రజలతో ఉండేది. ఉంది. ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఓటర్లు, రాజకీయ పార్టీలది కీలక పాత్ర.
కొత్తగా ఓటరుగా నమోదు చేసుకున్న అందరికీ నా బెస్ట్ విషెస్” అని జ్ఞానేశ్ పేర్కొన్నారు. అలాగే, వివేక్ జోషి కూడా ఈసీగా బాధ్యతలు చేపట్టారు. కాగా.. 25వ సీఈసీగా పనిచేసిన రాజీవ్ కుమార్ పదవీకాలం మంగళవారంతో ముగిసింది. ఈ సందర్భంగా అధికారులు ఆయనకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం మీడియాతో రాజీవ్ మాట్లాడారు. దేశ ఎన్నికల సంఘం ప్రజాస్వామ్య దేవాలయం వంటిదని అన్నారు.