జ్ఞాన్‌వాపి మసీదు సర్వేపై సుప్రీంకోర్టు స్టే

జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ సర్వేపై సుప్రీంకోర్టు స్టే విధించింది. జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ సర్వేను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను జులై 24వ తేదీ సోమవారం విచారించిన సుప్రీంకోర్టు..ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా-  బృందం సర్వేపై రెండు రోజుల స్టే విధించింది. ఈ సర్వే విషయంలో జ్ఞాన్‌వాపి మసీదు మేనేజ్‌మెంట్ కమిటీకి మరింత సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వారణాసి కోర్టు ఇచ్చిన  ఇంప్యుగ్డ్ ఆర్డర్ జూలై 26 సాయంత్రం 5 గంటల వరకు అమలు చేయొద్దని ఏఎస్ఐ అధికారులను ఆదేశించింది. ఈ లోగా వారణాసి జిల్లా కోర్టు ఆదేశాలను జ్ఞాన్‌వాపి మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేయవచ్చని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో సర్వే కోసం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా- బృందం జులై 24వ తేదీ సోమవారం ఉదయం అక్కడికి చేరుకుంది. ఈ బృందంలో మొత్తం 30 మంది ఉన్నారు.  సర్వే దృష్ట్యా  వారణాసిలో హై అలర్ట్‌ ఉంచారు.  క్యాంపస్ పరిసరాల్లో 2000 మందికిపైగా  జవాన్లు మొహరించారు. ఇరు వర్గాల లాయర్లు కూడా సర్వేలో పాల్గొనేందుకు వచ్చారు.  కాశీ విశ్వనాథ మందిరం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదును శాస్త్రీయంగా సర్వే చేయాలని జులై 21వ తేదీ శుక్రవారం వారణాసి కోర్టు ఆదేశించింది. 

ALSO READ:కేటీఆర్ బర్త్ డే సందర్భంగా వెయ్యిమంది టెకీల రక్తదానం

 వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ అంజుమన్ ఇంతేజామియా మసీదు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టులో జులై 24వ తేదీ సోమవారం విచారణ జరిగింది. జ్ఞాన్‌వాపి మసీదు మేనేజ్‌మెంట్ కమిటీ తరఫున సీనియర్ లాయర్ హుజెఫా అహ్మదీ వాదనలు వినిపిస్తూ- వారణాసి కోర్టు ఇచ్చిన ఆదేశాలపై తక్షణమే స్టే విధించాలని కోరారు. ఏఎస్‌ఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. అయితే సర్వే సందర్భంగా తవ్వకాలు చేస్తారా అని సీజేఐ ప్రశ్నించగా..- జ్ఞాన్‌వాపిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సర్వే చేస్తామని.., ఇప్పుడు ఎలాంటి తవ్వకాలు చేపట్టట్లేదని చెప్పారు.