హైదరాబాద్: ప్రణీత ఒక గైనకాలజిస్ట్. ఈమెకు సికిందర్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగితో 2018లో పెళ్లి జరిగింది. వీరికి మూడు సంవత్సరాల పాప ఉంది. వీళ్ళిద్దరూ అమెరికాలో ఉండి 2021లో హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. ప్రస్తుతం చంపాపేట్‌లోని ప్రెస్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఇద్దరి మధ్యలో గొడవలతో విడాకుల కేసు కోర్టులో ఉంది. ఇంట్లో పై పోర్షన్లో ప్రణీత అత్తమామ ఉంటుండగా, కింద పోర్షన్లో ప్రణీత, ఆమె పాప, తోడుగా ప్రణీత తల్లి రూప ఉంటుంది. ఫెర్నాండేజ్ హాస్పిటల్లో ప్రణీత గైనకాలజిస్ట్ డాక్టర్‌గా పనిచేస్తోంది.
భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా భర్త ఎక్కడికో వెళ్లిపోయాడు. ప్రస్తుతం అత్తా, కోడలికి తరచుగా గొడవలు జరుగుతున్నాయి. అత్త వేధింపుల కారణంగా ప్రణీత పలుమార్లు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకో లేదని బాధితురాలి బంధువులు ఆరోపించారు. నిన్న రాత్రి(జనవరి 27, 2025) మళ్లీ గొడవ జరగగా ప్రణీత సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా సరూర్ నగర్ సీఐ పట్టించుకోలేదని చెప్పారు. పైగా అక్కడ ఎందుకు ఉంటున్నావని, వేరుగా ఉండొచ్చుగా అని ఉచిత సలహా ఇచ్చాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ఈరోజు(జనవరి 28, 2025) ప్రణీత బర్త్ డే. అత్తమామల వేధింపులపై ఫిర్యాదు చేసినా పోలీసులు కూడా పట్టించుకోకపోవడంతో అధిక మోతాదులో టాబ్లెట్లు వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఆమె చంపాపేట్ లోని జీవన్ ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉంది. అయితే సీఎం సెక్యూరిటీ ఆఫీస్ లో ఉన్న చక్రధర్ రెడ్డి అనే అధికారి తరచూ పోలీసులకు ఫోన్ చేస్తూ అత్తమామలకు సపోర్ట్ చేస్తున్నాడని ప్రణీత కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాధితురాలు ఆత్మహత్యా యత్నానికి ముందు సెల్ఫీ వీడియో చేసింది. కాగా బాధితురాలి బంధువులు వారి ఇంటి ముందు ధర్నాకు దిగారు.