టెక్కీలకు అమెరికా గుడ్ న్యూస్ చెప్పింది. అగ్రరాజ్యంలో విదేశీయులు ఉద్యోగం చేసేందుకు జారీ చేసే హెచ్ 1బీ వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియను మార్చి 1న ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. మార్చి 1 నుంచి మార్చి 18 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుందని యూఎస్ సిటిజెన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ స్ఫష్టం చేసింది. 2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వీసాల కోసం సంస్థలు, ప్రతినిధులు 10డాలర్లు చెల్లించి ఆన్ లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ప్రకటించింది. మార్చి 18 వరకు వచ్చిన అప్లికేషన్లలో లాటరీ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన వారికి మార్చి 31లోగా సమాచారం అందించనున్నారు. హెచ్ 1బీ వీసా పొందిన వారు ఈ ఏడాది అక్టోబర్ నుంచి అమెరికాలో ఉద్యోగం చేసే వీలుంటుంది.
నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులు అమెరికాలో పనిచేసేందుకు అక్కడి ప్రభుత్వం ఏటా హెచ్ 1బీ వీసాలను జారీ చేస్తుంది. ఏటా 65వేల కొత్త వీసాలతో పాటు అమెరికాలో మాస్టర్స్ చేసే వారి కోసం మరో 20 వేల వీసాలు కేటాయిస్తుంది. హెచ్ 1బీ వీసాలు పొందేవారిలో 70శాతం మంది భారతీయులే ఉంటారు.