‘లార్డ్ ఆఫ్ ద రింగ్స్’ సినిమా చూసినవాళ్లకు అందులో మనుషుల్ని పోలిన మరుగుజ్జులు కచ్చితంగా గుర్తుంటారు. నాలుగడుగులకు మించని ఆ పొట్టివాళ్లనే ‘హాబట్’ అంటారు. వీళ్లు ఉండే ఇంటినే హాబట్ హౌస్ అంటారు. అండర్‌గ్రౌండ్(భూగర్భం)లో కట్టే ఈ ఇండ్లు ఎంతో అందంగా ఉంటాయి. అచ్చం అలాంటి ఇల్లు ఒకటి మనదేశంలో ఉంది. పుణెకు రెండున్నర కిలోమీటర్ల దూరంలోని ముర్బాద్ ఏరియాలో ‘అసంజ’ పేరుతో కట్టారు దీన్ని.
పూర్తిగా అండర్‌గ్రౌండ్‌లో ఉండే ఈ ఇల్లు రెండు భాగాలుగా కనిపిస్తుంది. ఒకటి ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్ కాగా, మరొకటి డబుల్ బెడ్రూమ్ హౌస్. అలాగే లోపల చిన్న స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. నేచురల్‌గా కనిపించేందుకు ఇంటి లోపల అక్కడక్కడ రాళ్లు పెట్టారు. భూగర్భంలో ఉంది కాబట్టి లైటింగ్ తక్కువ ఉంటుంది అనుకుంటే పొరపాటే. ఇంటికి పైభాగం, గోడలకు అద్దాలతో గుండ్రటి కిటీకీలు పెట్టారు.
వాటి వల్ల బయట ఉన్నట్లే లోపల వెలుతురు కనిపిస్తుంది. దట్టమైన కొండలను ఆనుకొని, పచ్చటి ప్రకృతి మధ్య కట్టిన ఈ హాబట్ హౌస్‌ను అద్దెకు కూడా తీసుకోవచ్చు. నిజానికి భూకంపాల నుంచి తట్టుకునేందుకు న్యూజిలాండ్‌లో ఇలాంటి ఇండ్లు ఎన్నో ఏండ్ల కిందటే ఉన్నాయి. వాటిని చూసే ‘లార్డ్ ఆఫ్ ద రింగ్స్’ సినిమాలో పెట్టారు. ఇప్పుడు మనదేశంలోకి కూడా వచ్చిందీ ఈ హాబట్ హౌస్. దీని గురించి బిజినెస్‌మ్యాన్, ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేయడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.