T20 World Cup 2024: పాకిస్తాన్ క్రికెట్‌ను నాశనం చేయడనికే వారిద్దరూ వచ్చారు: మహమ్మద్ హఫీజ్

T20 World Cup 2024: పాకిస్తాన్ క్రికెట్‌ను నాశనం చేయడనికే వారిద్దరూ వచ్చారు: మహమ్మద్ హఫీజ్

వరల్డ్ కప్ లో పాకిస్థాన్ కు వరుస పరాజయాలు వెంటాడుతున్నాయి. పటిష్టమైన భారత్ తో పాటు పసికూన అమెరికాతో ఆ జట్టు ఓటమి పాలైంది. ఈ రెండు మ్యాచ్ ల్లో కూడా పాక్ గెలుపుకు దగ్గరకు వచ్చి ఓడిపోయాయి. ఆఫ్ఘనిస్తాన్ తో సూపర్ ఓవర్ లో అనూహ్యంగా పరాజయం పాలైన పాక్.. నిన్న (జూన్ 9) భారత్ చేతిలో 120 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేయలేక ఓడింది. దీంతో ప్రస్తుతం సూపర్ 8 దశకు అర్హత సాధించడం కష్టంగా మారింది. మిగిలిన రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించినా సూపర్ 8 దశకు అర్హత సాధిస్తుందా అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. 

పాక్ వరుస ఓటములపై ఆ దేశంలో తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అభిమానుల నుంచి మాజీ ఆటగాళ్లు ఆ జట్టుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తాజాగా మాజీ ఆటగాడు మహమ్మద్ హఫీజ్ పాక్ ఓటములకు ఇమాద్ వసీం, మహమ్మద్ అమీర్ కారణమని అన్నాడు. పాక్ క్రికెట్ బోర్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ ఇద్దరు ఆటగాళ్లను వరల్డ్ కప్ కు ఎంపిక చేసి నాశనం చేసిందని ఆయన ఆరోపించారు. 

దేశ ప్రతిష్ట దిగజార్చిన అమీర్, ఇమాద్ వసీంను వరల్డ్ కప్ కు ఎంపిక చేసి పెద్ద తప్పు చేసిందని ఈ మాజీ క్రికెటర్ అన్నారు. పాక్ క్రికెట్ బోర్డ్ ఆరు నెలల క్రితం వారిని పాకిస్థాన్‌కు ఆడమని అడిగితే వారు లీగ్‌లకే ప్రాధాన్యమిచ్చారని.. ప్రస్తుతం ఎలాంటి లీగ్ లు లేకపోవడంతో వారు వరల్డ్ కప్ ఆడుతున్నారని హఫీజ్ మండిపడ్డాడు. వరల్డ్ కప్ లో అమీర్ అమెరికాపై సూపర్ ఓవర్ లో 18 పరుగులు సమర్పించుకున్నాడు. మరోవైపు ఇమాద్ వసీం భారత్ పై జరిగిన మ్యాచ్ లో 23 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేశాడు. 

31 ఏళ్ల అమీర్ పీసీబీతో చర్చలు జరిపిన తర్వాత తన అంతర్జాతీయ రిటైర్మెంట్‌పై యు-టర్న్ తీసుకున్నాడు. స్పాట్ ఫిక్సింగ్ కారణంగా ఆమీర్ నిషేధం ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత 2019లో టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లీగ్ ల్లో అదరగొడుతున్నాడు. మరోవైపు ఇమాద్ వసీం 2023 ఆఖరిలో అంతర్జాతీయ క్రికెట్‌కు వసీం గుడ్‌బై చెప్పాడు. ఆ తర్వాత ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌లలో వసీం భాగమయ్యాడు.