వడ్లు రాలినయ్​.. గడ్డి మిగిలింది

వడగండ్ల వానలు రైతును నిండా మంచుతున్నాయి. శని, ఆదివారాల్లో కురిసిన వర్షాలకు అన్నదాత అతలాకుతలమయ్యాడు. ఉమ్మడి కరీంనగర్​, వరంగల్​, ఖమ్మం జిల్లాల్లో  గాలి దుమారం, వడగండ్ల వాన దెబ్బకు వేలాది ఎకరాల్లో వడ్లు నేలరాలిపోగా..చివరికి గడ్డే మిగిలింది. కరీంనగర్​ జిల్లాలో 22 వేల ఎకరాల్లో, జనగామ జిల్లాలో 21 వేల ఎకరాల్లో వరి ధ్వంసమైందని అగ్రికల్చర్​ ఆఫీసర్లు అంచనా వేశారు. మామిడి, మిర్చి, పుచ్చ, తర్బూజ, కూరగాయల తోటలు సైతం పూర్తిగా దెబ్బతిన్నాయి. వడగండ్ల ధాటికి మిర్చి తోటలు నేలమట్టమయ్యాయి. రెక్కల కష్టం పోయిందని, పెట్టుబడి కూడా నీళ్లల్లో పోసినట్లయిందని బాధిత రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

నెట్‌‌వర్క్‌‌, వెలుగు: కరీంనగర్​ జిల్లా వ్యాప్తంగా  శనివారం కురిసిన వడగండ్ల వానకు 23,709 ఎకరాల్లో పంట నష్టం జరగగా 17,197 మంది రైతులు నష్టపోయినట్లు అగ్రికల్చర్ ఆఫీసర్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో 22,120 ఎకరాల్లో వరి, 334 ఎకరాల్లో మక్క, 1172 ఎకరాల్లో మామిడి, పుచ్చ, బొప్పాయి తోటలు, 83 ఎకరాల్లో కూరగాయల తోటలు ఉన్నట్లు గుర్తించారు. అత్యధికంగా చొప్పదండి మండలంలో 8176 ఎకరాల్లో పంట నష్టం జరగగా, 5,757 మంది రైతులు నష్టపోయినట్లు ఆఫీసర్లు తేల్చారు. హుజూరాబాద్ మండలంలో 3,871 ఎకరాల్లో పంట నష్టం జరగగా, 4,013 మంది రైతులు నష్టపోయినట్లు గుర్తించారు.  జనగామ జిల్లాలో 21 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అగ్రికల్చర్​ ఆఫీసర్లు ప్రాథమిక అంచనా వేశారు. రైతులు సుమారు రూ. 50 కోట్ల పైగా నష్టపోయారు. శనివారం రాత్రి కురిసిన రాళ్లవానతో  జనగామ, రఘునాథపల్లి, బచ్చన్నపేట మండలాల్లో  భారీ నష్టం జరిగింది. పంట నష్టంపై  అగ్రికల్చర్​ ఆఫీసర్లు ఆదివారం  ఫీల్డ్​ విజిట్​ చేయగా, రఘునాథపల్లి మండంలోని ఫతేషాపూర్​లో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేలరాలిన చోట్ల గింజలు ఏరుతూ లెక్కబెడుతుండడంపై మండిపడ్డారు. కండ్ల ముందు నష్టం కనబడుతోంటే గింజలు ఏరుతూ అంచనా వేయడం ఏమిటని నిలదీశారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో శనివారం కురిసిన వడగండ్ల వానకు 4743 ఎకరాల పంట నష్టం జరిగినట్లు ఏఓ అఫ్రోజ్​ తెలిపారు.

ఆగని అకాల వర్షాలు..

ఉమ్మడి వరంగల్‌‌, ఖమ్మం, మెదక్, నల్గొండ జిల్లాల్లో ఆదివారం కూడా ఈదురుగాలులు, వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. హనుమకొండ జిల్లాలోని వివిధ మండలాల్లో ఈదురుగాలులకు పంటలు నేలమట్టమయ్యాయి. కమలాపూర్ మండలం అంబాలలో ఓ రేకుల ఇంటి గోడ కూలి ఒకరు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ జిల్లాలో 4,082 ఎకరాల్లో వరి, 1162 ఎకరాల్లో మక్క, 665 ఎకరాల్లో మామిడి తోటలు దెబ్బతిన్నట్టు ఆఫీసర్లు ప్రాథమికంగా అంచనా వేశారు. మహబూబాబాద్​ జిల్లాలో  ఆదివారం సాయంత్రం  నర్సింహులపేట, గూడూరు​, కొత్తగూడ, గంగారం , తొర్రూరు మండలాల్లో భారీ వర్షం పడింది. కల్లాల్లో, కొనుగోలు సెంటర్లకు తెచ్చిన 50 టన్నుల వరి ధాన్యం తడిసిపోయింది. 6901 ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్లు అగ్రికల్చర్​ ఆఫీర్లు చెప్పారు. సూర్యాపేట జిల్లా  యార్కరాం,  చివ్వెంల  మండలం చందుపట్ల ఐ‌‌కే‌‌పీ సెంటర్లలో దాదాపు 500 మంది రైతుల వడ్లు కొట్టుకుపోయాయి. 

మేళ్లచెరువు మండలంలో ఈదురు గాలులకు పెద్ద చెట్లు కూలిపోయాయి. కరెంట్ పోళ్లు విరిగిపడ్డాయి. హుజూర్ నగర్ మండలం మిట్టగూడెంలో గోదాం పైకప్పు లేచిపోయి 2వేల బస్తా వడ్లు తడిశాయి. జాజిరెడ్డిగూడెం మండలంలో దాదాపు 10 వేల ఎకరాలు, నాగారం మండలంలో 2,310 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు ఆఫీసర్లు తెలిపారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో వడగళ్ల వానకు కొనుగోలు సెంటర్లలో ఆరబోసిన వడ్లు తడిశాయి. హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి తెచ్చిన వడ్లు, మక్కలు నీటిపాలయ్యాయి. భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వాపురం, చర్ల, మణుగూరు, గుండాల, చండ్రుగొండ మండలాల్లో మామిడి, మిర్చి పంటలకు తీవ్ర నష్టం కలిగింది. గుండాల మండలంలో ఆదివారం పిడుగుపాటుకు ఐదు ఆవులు చనిపోయాయి. మణుగూరులో ఓపెన్​కాస్ట్​లోకి వర్షపు నీరు చేరి బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. కాగా, మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ తెలిపింది.