- నేలకొరిగిన 500 ఎకరాల జొన్న పంట
ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. పంటలు నేలకొరగగా పలు చోట్ల చెట్లు విరిపోయాయి. ఆదిలాబాద్ మండలంలోని అంకోలి గ్రామంలో రెండు గుడిసెల పైకప్పులు ఎగిరిపోయాయి. ఆదిలాబాద్ రూరల్, తలమడుగు, జైనథ్, నేరడిగొండ, తాంసీ, బోథ్ మండలాల్లోని జొన్న, మొక్కజొన్న, పొగాకు పంటలు దెబ్బతిన్నాయి.
దాదాపు 500 ఎకరాల జొన్న పంట నేలకొరిగింది. కొద్ది రోజుల్లో చేతికొచ్చే పంట దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దెబ్బతిన్న పంట నష్టాన్ని సర్వే చేసి పరిహారం అందించాలని పలువురు రైతులతో కలిసి తలమడుగు జడ్పీటీసీ గోక గణేశ్ రెడ్డి కలెక్టర్ రాజర్షి షాను కలిసి వినతి పత్రం అందజేశారు.