- కండగండ్లే మిగిలాయి
- నేలవాలిన మక్క, వరి, రాలిన మామిడి
- కామారెడ్డి జిల్లాలో 20 వేల ఎకరాలకు పైగా దెబ్బతిన్న పంటలు
- నిజామాబాద్‌లో 6,058 ఎకరాల్లో పంట నష్టం
- లబోదిబోమంటున్న అన్నదాతలు
కామారెడ్డి, నిజామాబాద్, వెలుగు: ఉమ్మడి జిల్లాలో శనివారం కురిసిన అకాల వర్షం రైతులను ఆగం జేసింది. భారీగా వడగండ్లు పడడంతో వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కామారెడ్డి జిల్లాలో 20 వేల ఎకరాల్లోకు పైగా వరి, మక్క, జొన్న, కూరగాయల పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా. నిజామాబాద్ జిల్లాలోనూ 6,058 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. ఆయా ఏరియాల్లో అరగంట నుంచి గంట పాటు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వడగండ్ల వర్షం కురిసింది. పెద్ద వడగండ్లు పడడంతో పంటలు దెబ్బతిన్నాయి. మరో నెలరోజుల్లో పంటలు చేతికొస్తాయనుకుంటే అకాల వర్షాలతో దెబ్బతినడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈదురుగాలులు, రాళ్లు పడడంతో మామిడికాయలు రాలిపోయాయి. పలు చోట్ల కరెంట్ స్తంభాలు పడిపోయి వైర్లు తెగిపడ్డాయి. చెట్లు నేలకొరిగాయి.
పంటనష్టం ఇలా..
కామారెడ్డి జిల్లాలోని 15 మండలాల్లోని 130 గ్రామాల్లో 20,071 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అగ్రికల్చర్ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. 16,450 ఎకరాల్లో వరి, 3,621 ఎకరాల్లో మక్క, 163 ఎకరాల్లో మామిడి, 600 ఎకరాల్లో జొన్న, 50 ఎకరాల్లో కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. కామారెడ్డి, భిక్కనూరు, రాజంపేట, రామారెడ్డి, దోమకొండ, తాడ్వాయి, సదాశివ్‌నగర్, బిచ్కుంద, మద్నూర్, బీర్కుర్, బాన్సువాడ, బీబీపేట, పాల్వంచ, నస్రుల్లాబాద్, గాంధారి మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కామారెడ్డి మండలంలోని నర్సన్నపల్లి, కొటాల్పల్లి, పాతరాజంపేట, రాజంపేట మండలం పొందూర్తి, శివాయిపల్లి, తలమడ్ల, ఆరేపల్లి, భిక్కనూరు మండలం రామేశ్వర్‌పల్లి, జంగంపల్లి, అంతంపల్లి, దోమకొండ మండలం సీతరాంపల్లి, అంచనూర్, అంబారిపేట తదితర ఏరియాల్లో పంటలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. తాడ్వాయి, కృష్ణాజీవాడి గ్రామాల్లో రేకుల షెడ్లు పడిపోయాయి.
బ్రహ్మాజీవాడిలో మూడు పశువులు చనిపోయాయి. కరెంట్ పోల్స్ విరిగిపోవడం, వైర్లు తెగిపోవడంతో కరెంట్సప్లయ్ ఆగిపోయింది. ఆదివారం తిరిగి పునరుద్ధరించారు. నిజామాబాద్ జిల్లాలో 5,661 ఎకరాల్లో వరి, 292 ఎకరాల్లో మక్క, 93 ఎకరాల్లో జొన్న, 12 ఎకరాల్లో నువ్వుల పంట దెబ్బతింది. 44 గ్రామాల్లోని 3,076 మంది రైతులు పంట నష్టపోయారు. వడగండ్ల ప్రభావం రూరల్ నియోజకవర్గంలో అధికంగా ఉంది. ఆ ఒక్క నియోజకవర్గంలోనే మొత్తం 4,775 ఎకరాల పంటలు దెబ్బతిన్నాయి. తర్వాత బోధన్ నియోజకవర్గంలో 1,151 ఎకరాల పంట నష్టం వాటిల్లింది. బాల్కొండ నియోజకవర్గం మెండోరాలో 64 ఎకరాల మొక్కజొన్న, నువ్వుల పంట దెబ్బతింది.
రెండెకరాల వరి పంటకు దెబ్బ
రెండెకరాల్లో నాటేసిన. పెట్టుబడికి రూ.50 వేలకు పైగా ఖర్చయ్యింది. బోర్లలో నీళ్లు తక్కువగా వస్తుండడంతో పంట ఎండిపోవద్దని మడిమడికి రోజంతా దగ్గర ఉండి నీళ్లు పారించిన. ఇన్నిరోజులు పడిన కష్టం కొద్ది సేపట్లోనే మట్టిపాలైంది. వరికర్రలు మొత్తం వంగి గింజలు రాలిపోయాయి.ఏ మాత్రం పంట చేతికొచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వమే ఆదుకోవాలి.
చిదుర సంజీవ్‌రెడ్డి, నర్సన్నపల్లి, కామారెడ్డి
మక్క పూర్తిగా పోయింది
రెండు ఎకరాల్లో మక్క వేశా. రూ.25 వేల నుంచి రూ.30వేల వరకు పెట్టుబడి పెట్టా. మరో నెలరోజులైతే పంట చేతికొస్తుండే. 15 నిమిషాల పాటు పెద్దపెద్ద రాళ్లతో వానపడింది. దీంతో మక్క పూర్తిగా దెబ్బతింది. పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదు. పోయిన సారి అకాల వర్షాలతో నష్టపోయాం. ఈ యేడు అదే పరిస్థితి.
బాలరాజు, శివాయిపల్లి, రాజంపేట మండలం