
తెలంగాణలో రెండు రోజుల నుంచి పలు చోట్ల అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. కొన్ని చోట్ల వడగండ్ల వాన బీభత్సం సృష్టిస్తోంది. వడగండ్లకు పంటలు దెబ్బతింటున్నాయి. మార్చి 22 న సాయంత్రం వికారాబాద్ జిల్లాలో పలుచోట్ల వర్షం దంచి కొట్టింది. మర్పల్లి మండలం బిల్కల్ గ్రామంలో వడగండ్ల వానకు మంగళి రమేష్ అనే రైతు రెండెకరాల మిరప పంట పూర్తిగా ద్వంసం అయ్యింది. జిల్లాలో పలుచోట్ల ఈదురు గాలులతో పాటు వడగండ్లతో వర్షం పడింది. చిట్టి గడ్డ రైల్వేస్టేషన్ రోడ్ లో గాలివానకు చెట్టు విరిగిపడటంతో రాకపోకలకు కాసేపు ఇబ్బంది తలెత్తింది. ప్రయాణికులు పోలీసులు రోడ్డుపై విరిగిపడ్డ చెట్టును తొలగించారు.
ALSO READ | Rain Alert: తెలంగాణలో ఈ జిల్లాల్లో వడగండ్ల వాన..పిడుగులు పడే ఛాన్స్
తెలంగాణలోని పలు జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.శనివారం(మార్చి22) రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో వడగండ్ల వానలు పడే ఛాన్స్ ఉందని..ఆయా జిల్లాల ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాలు, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వడగండ్ల వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, పిడుగులు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.