వడగండ్ల వాన బీభత్సం..సిద్దిపేట జిల్లాలో 9149 ఎకరాల్లో పంట నష్టం

వడగండ్ల వాన బీభత్సం..సిద్దిపేట జిల్లాలో 9149 ఎకరాల్లో పంట నష్టం
  • పిడుగుపాటుకు ఆవు మృతి
  • ఆగమవుతున్న అన్నదాతలు

సిద్దిపేట, సంగారెడ్డి, వెలుగు: ఉమ్మడి మెదక్​జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా వడగండ్ల వానలు పడుతున్నాయి. సిద్దిపేట జిల్లాలో గురువారం తెల్లవారుజామున కురిసిన వడగండ్ల వాన తొమ్మిది మండలాల పరిధిలోని 31 గ్రామాల్లో  బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కురిసిన వానకు 9149 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వరి, మామిడి, మొక్కజొన్న, కూరగాయల  పంటలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. జిల్లాలోని కొండపాక, మద్దూరు, చేర్యాల, చిన్నకోడూరు, నారాయణ రావుపేట, నంగునూరు, బెజ్జంకి, ధూల్మిట్ట, సిద్దిపేట అర్బన్ మండలాల్లోని వివిధ గ్రామాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.

3755 మంది రైతులకు సంబంధించి 6321 ఎకరాల వరి,  33  ఎకరాల్లో 18 మంది రైతులకు సంబంధించి మొక్కజొన్న, 1141 ఎకరాల్లో 446 మంది రైతులకు సంబంధించి మామిడి, 707 మంది రైతులకు సంబంధించి 1654 ఎకరాల కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి.  చేర్యాల మండలం ముస్త్యాల గ్రామంలో పిడుగు పాటుకు నరసింహరెడ్డికి చెందిన ఆవు మృతి చెందింది. ఆయా మండలాల్లో వ్యవసాయ, ఉద్యానవన అధికారులు పంట నష్టం అంచనాలు వేస్తున్నారు. జిల్లా వ్యవసాయ అధికారిరాధిక, ఏడీఏ పద్మతో పాటు ఏఈవోలు దెబ్బతిన్న  పంటలను  క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. 

నంగునూరులో అత్యధిక నష్టం

వడగండ్ల వర్షం వల్ల నంగునూరు మండలంలోని 9 గ్రామాల్లో పలు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మండల పరిధిలో మొత్తం 3869 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మండలంలోని  ఖానాపూర్ లో 310 , మురదాబాద్  235,  వెంకటాపూర్ లో 320 , కోనాయిపల్లి 150, తిమ్మాయిపల్లి 102, పాలమాకుల 1010, ముండ్రాయి 602 , రాజ్ గోపాల్ పేట్ 520, నర్మెట్ట 280, మైసంపల్లి 300 , మాగ్ధుమ్ పూర్ లో 50  ఎకరాల్లో పలు పంటలు దెబ్బతిన్నాయి. 

సంగారెడ్డి జిల్లాలో..

సంగారెడ్డి, జహీరాబాద్, జోగిపేట, మునిపల్లి, పుల్కల్, సదాశివపేట, నారాయణఖేడ్, పటాన్​చెరు, ఝరాసంఘం, కంగ్టి, చౌటకూర్ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఝరాసంఘంలో  తహసీల్దార్ ఆఫీస్ ముందు గాలివాన బీభత్సానికి చెట్టు విరిగి బైకులపై పడింది. కంగ్టి మండలం నాగన్ పల్లి గ్రామంలో ఈదురు గాలులకు ఇంటిపైరేకులు ఎగిరిపోవడంతో ఇంట్లో ఉన్న సామాన్లు తడిసి ముద్దయ్యాయి. రాయికోడ్ మండలం నాగ్వార్ గ్రామ శివారులో విద్యుత్ స్తంభాల ఇన్సులేటర్  పగిలిపోవడంతో  మండల వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సంగారెడ్డి, నారాయణఖేడ్ లో కురిసిన వర్షానికి రహదారులపై మురుగునీరు చేరి రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.

ఎకరాకు రూ.20 వేల పరిహారం ఇవ్వాలి

వడగండ్ల వర్షంతో పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ.20 వేల పరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్​రావు డిమాండ్ చేశారు. వడగండ్ల వర్షం విషయం తెలుసుకుని కలెక్టర్, వ్యవసాయ అధికారులతో ఫోన్ లో మాట్లాడి పంట నష్టం వివరాలను  ప్రభుత్వానికి పంపాలని కోరారు. వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి  పంటనష్టంపై అంచనా వేసి నష్ట పోయిన రైతుల జాబితాను ప్రభుత్వానికి పంపాలని కోరారు.  రైతులు అధైర్య పడొద్దని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆర్థిక సాయం అందేలా చూస్తానని మనో ధైర్యాన్నిచ్చారు.