పసుపుతో చర్మ సమస్యలు దూరమవుతాయి. ఇది మనకు తెలిసిందే. అయితే జుట్టుకు సంబంధించిన ఎన్నో సమస్యలకు కూడా పసుపు పరిష్కారం చూపుతుందంటున్నారు డెర్మటాలజిస్టులు. ఆరోగ్యవంతమైన జుట్టు కోసం ఈ పసుపును ఎలా వాడాలో చూద్దాం...
శుభకార్యాలేవైనా పసుపుతోనే మొదలవుతాయి. వంటల్లోనూ, పసుపును వాడతాం. అందానికీ పసుపు మంచి హోం రెమెడీ. ఆయుర్వేద వైద్యంలో పసుపు వాడకం ఎక్కువే. ఇలా మన జీవితంలో పసుపు ఓ భాగమైపోయింది. అయితే చాలామందికి తెలియని విషయమేంటంటే.. పసుపు జట్టు సమస్యలను కూడా చాలా చక్కగా పరిష్కరిస్తుంది.
చుట్టూ పొల్యూషన్, చేసే జాబ్లో స్ట్రెస్, ఏ ప్రొడక్ట్ వాడినా కెమికల్స్. దీంతో ప్రతిఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్య జుట్టురాలడం. చుండ్రుతో మొదలయ్యే ఈ సమస్య వెంట్రుకలు బలహీనపడడం, జుట్టురాలడం వంటి పరిణామాలకు దారితీస్తుంది. అయితే వంటింట్లో ఉండే పసుపుతో ఈ సమస్యలన్నీ పరిష్కరించుకోవచ్చు. ఎందుకంటే.. పసుపులో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ సెప్టిక్ గుణాలు ఉంటాయి. అందుకే దీనిని తలకు రాయడం వల్ల జుట్టు సమస్యలు చాలా ఎఫెక్టివ్ పరిష్కారమవుతాయి.
ఎలా వాడాలి?
పొడి రూపంలో ఉండే పసుపును నేరుగా తలకు పట్టించడం కష్టం. ఏదైనా లిక్విడ్లో పసుపు కలిపి జుట్టుకు రాసుకోవాలి. ఆలివ్ ఆయిల్లో పసుపు కలిపి తలకు రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. రాత్రంతా అలాగే ఉంచుకున్నా ఎటువంటి సమస్య ఉండదు. ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేయాలి. ఆలివ్ ఆయిల్ తో జుట్టు బలంగా పెరిగితే.. పుసుపు వాడడం వల్ల మాడుపై ఉన్న చుండ్రు తగ్గిపోతుంది.
ALSO READ : Health tips: బరువులు ఎత్తండి.. ఎక్కువకాలం బతకండి..
అంతేకాదు.. రక్తప్రసరణ బాగా జరుగుతుంది. వారంలో ఒకసారైనా ఇలా ఆలివ్ ఆయిల్లో పసుపు కలిపి తలకు రాసుకుంటే జుట్టుకు సంబంధించిన ఏ సమస్య అయినా పరిష్కారమవుతుంది. అయితే సున్నితమైన చర్మం ఉన్నవారు నెలలో రెండుసార్లు మాత్రమే వాడాలి.
హెన్నాతో కలిపి..
జుట్టు కోసం హెన్నా వాడుతుంటే అందులో కొంచెం పసుపు కలిపి జుట్టుకు రాసుకోండి.. దీనివల్ల జుట్టుకు మంచి రంగు వస్తుంది.. అంతేకాదు. చుండ్రు సమస్య కూడా పూర్తిగా తొలగిపోతుంది.
పచ్చిపాలలో కలిపి..
పచ్చిపాలలో పసుపు కలిపి జట్టుకు బాగా పట్టించాలి. గంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఆ రోజు షాంపూ వాడకుండా మరుసటి రోజు షాంపూతో స్నానంచేయాలి. ఇలా చేస్తే మంచి రిజల్ట్ కనిపిస్తుంది.
స్నానం చేసే నీళ్లలో...
తలస్నానం చేసే ముందు గోరువెచ్చని నీళ్లలో పసుపు కలిపి జుట్టును తడపాలి. అరగంట అలా వదిలేసి.. ఆ తర్వాత స్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో పసుపు కలిపినా సరే... దీనివల్ల జుట్టు సమస్యతోపాటు చర్మ సమస్యలు కూడా దూరమవుతాయి.
షాంపూతో కలిపి..
ఆయిలీ స్కిన్ ఉన్నవారు జిడ్డుతో ఇబ్బంది. పడుతుంటారు. రోజూ తలస్నానం చేసినా జుట్టు జిడ్డుగా కనిపిస్తుంది. దీనికి కూడా పసుపు మంచి పరిష్కారం. షాంపూలో పసుపు, కొంచెం ఉప్పు కలిపి తలకు రుద్దుకోవాలి. దీనిని ఎక్కువసేపు ఉంచకుండా వెంటనే కడిగేయాలి.. దీంతో మాడు చాలాబాగా క్లీస్ అవుతుంది. జిడ్డు సమస్య కూడా దూరమవుతుంది.
తెల్లబడుతుందనుకోవడం అపోహే...
తలకు పసుపు రాస్తే జుట్టు తెల్లబడుతుందని చాలామంది అనుకుంటారు. నిజానికి ఇది అపోహ మాత్రమేనంటున్నారు డెర్మటాల జిస్టులు. ఉప్పు వాడితే జుట్టు ఊడిపోతుందని భయపడతారు. ఇది కూడా అపోహే. ఉప్పు, పసుపు చర్మానికి ఎంతో మేలు చేస్తాయని, రెండింటిలో కూడా చర్మసంరక్షణకు సంబంధించిన ఔషధ గుణాలున్నాయట. దీంతో చర్మానికి, జుట్టుకు సంబంధించి ఏ సమస్య ఉన్నా పసుపు, ఉప్పును హ్యాపీగా వాడుకోవచ్చని చెబుతున్నారు. కొందరిలో ఉప్పు ఎలర్జీకి కారణమవుతుంది. అలాంటివారు మాత్రం ఉప్పును వాడకుండా కేవలం పసుపును ఉపయోగించాలని సూచిస్తున్నారు..