హైదరాబాద్ సిటీలో ఇలా కూడా జరిగిందా..? : బట్టతలపై జుట్టు అంటూ అందరికీ గుండ్లు కొట్టి పారిపోయాడు..!

హైదరాబాద్ సిటీలో ఇలా కూడా జరిగిందా..? : బట్టతలపై జుట్టు అంటూ అందరికీ గుండ్లు కొట్టి పారిపోయాడు..!

విక్రమార్కుడు సినిమా.. రాజమౌళి దర్శకుడు.. రవి తేజ హీరో.. ఈ మూవీలో ఓ సీన్ ఉంటుంది.. అత్తిలి చిరబరా స్వామి.. సగం గుండ్లు కొట్టి పోతాడు.. బ్రహ్మానందం వచ్చి మిగతా సగం గుండు గీకినందుకు వెయ్యి రూపాయలు వసూలు చేస్తాడు.. ఈ సీన్ అల్టిమేట్.. ఈ కామెడీ నెవ్వెర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. సేమ్ టూ సేమ్ అలాంటి సీనే హైదరాబాద్ ఓల్డ్ సిటీలో జరిగింది.. ఏంటీ నమ్మటం లేదా.. నోరెళ్లబెడుతున్నారు.. నిజం అండీ బాబూ.. అత్తిలి చిరబరానంద స్వామి తరహాలోనే.. బట్టతలపై జుట్టు మొలిపిస్తాను అంటూ ఉన్న అందరికీ గుండ్లు కొట్టి.. ఏదో కెమికల్ రాసి.. డబ్బులు వసూలు చేసి పారిపోయాడు.. తీరా గుండుపై జుట్టు రావటం ఏమోగానీ.. రాసిన కెమికల్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి అందరూ ఆస్పత్రిపాలు అవుతున్నారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఏరియాలో వెలుగు చూసిన ఊహించని ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి

ఢిల్లీకి చెందిన వకీల్ బట్టతల ఉన్న వారికి జుట్టు తెప్పిస్తానని తన సోషల్ మీడియా ద్వారా తెగ ప్రచారం చేశాడు.  ఇటీవలే ఢిల్లీకి చెందిన ఓ బిగ్ బాస్ కంటెస్టెంట్ కు  కూడా తాను జుట్టు తెప్పించానని చెప్పాడు. త్వరలోనే హైదరాబాద్ పాతబస్తీలోని తన ఫ్రెండ్  దగ్గరకు  వస్తానని చెప్పాడు. దీంతో పాతబస్తీలోని ఫతే దర్వాజాలోని ఓ సెలూన్ షాప్ కి ఏప్రిల్ 6న వచ్చాడు వకీల్.

►ALSO READ | హైదరాబాద్కు వస్తున్న రైలులో భారీ చోరీ..దంపతుల నుంచి 15 తులాల నగలు ఎత్తుకెళ్లారు

ఈ విషయం తెలసుకున్న  వందలాది మంది బట్టతల యువకులు జుట్టు కోసం  షాపు ముందు క్యూ కట్టారు. తమకు జుట్టు మొలిపించాలని పట్టుబట్టారు. దీంతో వకీల్ అందరినీ లైన్లో నిల్చోబెట్టి గుండు గీసి కెమికల్ పూసి పంపించాడు. ఒక్కో గుండుకు వంద రూపాయల వరకు తీసుకున్నాడని తెలుస్తోంది. ఇలా ఒక్కరోజే వందలాది మందికి గుండు గీసి కెమికల్ రాసి పంపించాడు వకీల్. తర్వాత కాసేపటికి జుట్టు రావడం పక్కన పెడితే.. కెమికల్ రాసుకున్న యువకులకు మంటలు రావడం స్టార్ట్ అయ్యింది . కొందరికి బొబ్బలు కూడా వచ్చాయి. దీంతో వెంటనే వందలాది మంది యువకులు ఆస్పత్రిలో చేరారు. 

వకీల్ గుండు గీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.