హైదరాబాద్, వెలుగు : ఈవీ- యాజ్ -ఏ- సర్వీస్ ప్లాట్‌ఫారమ్ అయిన హాలా మొబిలిటీ, తన ప్రీ-సిరీస్ ఏ ఫండింగ్ రౌండ్‌లో రూ. 51 కోట్లు సేకరించింది. ఇది లోన్, ఈక్విటీ కలయికతో సమకూరింది. ఈ రౌండ్‌లో వ్యవస్థాపకులు శ్రీకాంత్ రెడ్డి స్నేహిత్ రెడ్డి, ఫణి రమినేని (ప్రివియా హెల్త్ వ్యవస్థాపకుడు)తో పాటు రోహన్ బజాజ్ సిండికేట్, ఇన్వెస్ట్, సార్తి యాంజెల్స్, బెస్ట్‌వాంటేజ్, హెచ్‌ఎన్‌ఐలు, ఫ్యామిలీ ఆఫీసుల నెట్‌వర్క్ పాల్గొన్నారు.
ఈ కొత్త మూలధనంతో హాలా మొబిలిటీ ఈవీ ఫ్లీట్‌ను పెంచనుంది. మనదేశంలోని ఆరు అదనపు నగరాల్లో తన సేవలను విస్తరించనుంది. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి కంపెనీ 10వేల కొత్త ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న హాలా మొబిలిటీ హైదరాబాదుతోపాటు బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు వంటి ఆరు ప్రధాన భారతీయ నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.