
రంజాన్ మాసం మొదలైపోయింది. ఈ సీజన్లో చేసే స్పెషల్ రెసిపీ హలీమ్‌కి ఫ్యాన్స్ ఉంటారంటే ఆశ్చర్యం లేదు. పల్లె, పట్నం అని లేకుండా ఎక్కడ చూసినా హలీమ్ స్టాల్స్ దర్శనమిస్తుంటాయి. దారిన వెళ్లే వాళ్ల చూపంతా పొగలు కక్కే హలీమ్ హండీ వైపే! ఆ ఘుమఘుమలకు నోరూరిపోతుంటుంది మరి. కుల, మత బేధాలు లేకుండా అందరూ ఎంజాయ్ చేసే రెసిపీ ఇది. ఇక హైదరాబాదీ హలీమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదొక్కటే కాదు.. హలీమ్‌ని వేర్వేరు విధాలుగా వెరైటీ రుచుల్లో కూడా చేసుకోవచ్చు. నాన్ వెజ్ ఇష్టపడనివాళ్ల కోసం వెజ్ వెరైటీ, పిల్లలు ఇష్టంగా తినేందుకు స్వీట్ హలీమ్ ఇలా చాలానే ఉన్నాయి. మరి వాటి తయారీ ఎలాగో ఇక్కడ చూసేయండి.
మీల్మేకర్తో వెజ్
కావాల్సినవి : మీల్ మేకర్ – వంద గ్రాములు వేడి నీళ్లు – అర లీటరు , ఓట్స్, మినప్పప్పు – ఒక్కోటి పావు కప్పు, యాలకులు – ఐదు, మిరియాలు, జీలకర్ర, షాజీరా – ఒక్కో టీస్పూన్
లవంగాలు – ఏడు, తోక మిరియాలు (కెబాబ్ చీని) – అర టీస్పూన్, దాల్చిన చెక్క – రెండు, నల్లయాలక – ఒకటి, గులాబీ రేకులు (ఎండినవి) – రెండు టేబుల్ స్పూన్లు, గోధుమ రవ్వ – అర కప్పు, నెయ్యి, బీన్స్, క్యారెట్ తరుగు – ఒక్కోటి పావుకప్పు, జీడిపప్పులు – రెండు టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి – నాలుగు, అల్లం – వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, వేగించిన ఉల్లిగడ్డ తరుగు, పాలు – ఒక్కో కప్పు, పుదీనా, కొత్తిమీర – కొంచెం, నీళ్లు, ఉప్పు – సరిపడా
తయారీ : పాన్‌లో మీల్ మేకర్స్ వేసి, వేడి నీళ్లు పోసి ఉడికించాలి. తర్వాత ఆ నీటిని వడకట్టి, మీల్ మేకర్స్‌ని మిక్సీపట్టాలి. తర్వాత మిక్సీజార్‌లో ఓట్స్, మినప్పప్పు, గోధుమ రవ్వ, మిరియాలు, జీలకర్ర, షాజీరా, యాలకులు, లవంగాలు, తోక మిరియాలు, దాల్చిన చెక్క, నల్లయాలక, గులాబీ రేకులు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ పొడిని ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి కలపాలి. ఒక పాన్‌లో నెయ్యి వేడి చేసి జీడిపప్పులు వేసి వేగించాలి. తర్వాత అందులో బీన్స్, క్యారెట్ తరుగు, పచ్చిమిర్చి చీలికలు వేయాలి.
అవన్నీ వేగాక గ్రైండ్ చేసిన మీల్ మేకర్ ముద్ద వేసి కలపాలి. అల్లం – వెల్లుల్లి పేస్ట్, వేగించిన ఉల్లిగడ్డ తరుగు, పుదీనా, కొత్తిమీరతోపాటు రెడీ చేసుకున్న మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలపాలి. నీళ్లు పోసి కలిపి కాసేపు ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు వేసి, పాలు పోస్తూ గరిటెతో కలపాలి. చివరిగా నెయ్యి కూడా వేసి కలిపాక మరికాసేపు ఉడకనిస్తే సరి. ఈ వెజ్ హలీమ్ నాన్ వెజ్ కంటే రుచిగా ఉంటుంది.
అరబిక్ చికెన్ హరీస్
కావాల్సినవి : బార్లీ, నీళ్లు – రెండున్నర కప్పుల చొప్పున
ఉప్పు – సరిపడా, జీలకర్ర – ఒకటిన్నర టేబుల్ స్పూన్, అల్లం– వెల్లుల్లి పేస్ట్, సోంపు – ఒక్కో టేబుల్ స్పూన్, అనాస పువ్వు – ఒకటి, చికెన్ (బోన్‌లెస్) – పావు కిలో
తయారీ : బార్లీ గింజలను శుభ్రంగా కడిగి, నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. పాన్‌లో నీళ్లు పోసి, అందులో నానబెట్టిన బార్లీ గింజలు, ఉప్పు, ఒక టీస్పూన్ నూనె వేసి ఉడికించాలి. మరో పాన్‌లో చికెన్‌తోపాటు ఉప్పు, పసుపు వేసి ఉడికించి పక్కన పెట్టాలి. జీలకర్ర, సోంపు, అనాసపువ్వును మిక్సీపట్టి పౌడర్ చేయాలి. అందులో సగం మసాలాపొడిని ఉడికించిన చికెన్‌లో వేయాలి. దాంతోపాటు ఉప్పు, అల్లం– వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. మూతపెట్టి పావుగంటపాటు ఉడికించాలి.
తర్వాత ముక్కల్ని, సూప్‌ని వేరు చేయాలి. చికెన్ ముక్కల్ని మెదపాలి. తర్వాత బార్లీని కూడా మెత్తగా రుబ్బాలి. అందులో చికెన్ సూప్, మెదిపిన చికెన్ వేసి బాగా కలపాలి. మూతపెట్టి పది నిమిషాలు ఉడికించాలి. మిగిలిన మసాలా, నూనె, కొత్తిమీర వేసి మూతపెట్టి ఉడికించాలి. ఐదు నిమిషాల తర్వాత మొత్తం ఒకసారి కలపాలి. దీన్ని వేడి వేడిగా తింటే టేస్టీగా ఉంటుంది.
స్వీట్‌గా..
కావాల్సినవి :
గోధమలు, చక్కెర – ఒక్కో కప్పు
శనగపప్పు, బియ్యం, నెయ్యి – ఒక్కోటి రెండు టేబుల్ స్పూన్లు, పాలు – ఒకటిన్నర లీటర్లు
బాదం, జీడిపప్పు, ఫూల్ మఖానా, ఎండుద్రాక్ష – సరిపడా
తయారీ : గోధుమలు, శనగపప్పు, బియ్యాన్ని వేర్వేరుగా కడిగి నానబెట్టాలి. తర్వాత వాటిని నీటితో సహా ప్రెజర్ కుక్కర్లో వేసి మూతపెట్టి ఉడికించాలి. పాన్‌లో నెయ్యి వేడి చేసి అందులో బాదం, జీడిపప్పు తరుగు వేసి వేగించాలి. ఆ తర్వాత మఖానా, ఎండు ద్రాక్షలు కూడా వేసి కలపాలి. అవన్నీ వేగాక తీసి పక్కన పెట్టాలి. అదే పాన్‌లో ఉడికించిన మిశ్రమం వేయాలి. అందులో పాలు పోసి, చక్కెర వేసి కలపాలి. మిశ్రమం దగ్గరపడ్డాక వేగించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలిపితే తియ్యటి హలీమ్ రెడీ.