బుకారెస్ట్: రొమేనియా స్టార్ ప్లేయర్ సిమోనా హలెప్ (33 ఏళ్లు) బుధవారం టెన్నిస్‌కు వీడ్కోలు పలికింది. రొమేనియా ఓపెన్‌లో తొలి రౌండ్‌లో ఓడిన తర్వాత ఆమె రిటైర్మెంట్ ప్రకటన చేసింది. డోపింగ్ సస్పెన్షన్ తర్వాత మళ్లీ రాకెట్ పట్టిన హలెప్ కేవలం ఆరు మ్యాచ్‌లే ఆడింది. కానీ మునుపటి స్థాయిలో సత్తా చాటలేకపోవడంతో రిటైర్మెంట్ వైపు మొగ్గింది. 2022 యూఎస్ ఓపెన్‌లో నిషేధిత డ్రగ్ రొక్సాడస్టాట్‌ను వాడినట్లు తేలడంతో ఆమెపై నాలుగేళ్ల నిషేధం విధించారు.
అయితే యూరోపియన్ యూనియన్‌లో ఈ డ్రగ్‌పై నిషేధం లేకపోవడంతో ఆమె కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్ (కాస్)లో అప్పీల్ చేసింది. దీనిపై విచారణ చేపట్టిన కాస్ హలెప్‌పై విధించిన బ్యాన్‌ను తొమ్మిది నెలలకు తగ్గించింది. 2017లో డబ్ల్యూటీఏలో నంబర్‌వన్ ర్యాంక్‌ను సాధించిన హలెప్.. తన కెరీర్‌లో వింబుల్డన్ (2019), ఫ్రెంచ్ ఓపెన్ (2018)ను సొంతం చేసుకుంది.
ఆస్ట్రేలియన్ ఓపెన్ (2018), ఫ్రెంచ్ ఓపెన్ (2014, 2017)లో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. కెరీర్ మొత్తంలో 24 సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన హలెప్ 40 మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీని కైవసం చేసుకుంది.