- లాయర్లతో వస్తానన్న కేటీఆర్..
- వద్దని వారించిన ఆఫీసర్లు
- హైకోర్టుకు వెళ్తామంటున్న ఏసీబీ ఆఫీసర్లు
- దర్యాప్తునకు సహకరించాలని కోర్టు చెప్పినా వినలేదంటున్న అధికారులు
- అడ్వొకేట్లను తీసుకెళ్లడం రాజ్యాంగపరమైన హక్కు అంటున్న కేటీఆర్
- ఫార్ములా ఈ కేసులో జరగని కేటీఆర్ విచారణ
హైదరాబాద్: ఫార్ములా ఈ రేసు కేసులో ఇవాళ్టి విచారణకు హైడ్రామా మధ్య కేటీఆర్ డుమ్మా కొట్టారు. ఉదయం నందినగర్ నుంచి బయల్దేరిన కేటీఆర్ ఏసీబీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో కార్యాలయం వద్ద ఆయన తరఫు న్యాయవాదిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనతో పాటు న్యాయవాది వస్తే నష్టమేంటని ప్రశ్నించారు.న్యాయవాదిని తీసుకెళ్లడం రాజ్యాంగం తనకు కల్పించిన హక్కు అని పేర్కొన్నారు. అనుమతి లేదని ఏసీబీ అధికారులు తెలుపడంతో లిఖిత పూర్వకంగా ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అరగంట పాటు హైడ్రమా కొనసాగింది. దీనిపై రోడ్డుపైనే తన స్పందనను రాతపూర్వకంగా ఏసీబీ అధికారులకు అందజేశారు. ఈ మేరకు ఏసీబీ అధికారుల నుంచి రిసీవ్డ్ కాపీ తీసుకొని విచారణకు హాజరు కాకుండానే వెళ్లిపోయారు.
ఈ లేఖలో తాను దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు ఇచ్చే వరకు విచారణ వాయిదా వేయాలని కోరారు. డిసెంబర్ 18వ తేదీన తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను హైకోర్టులో సవాలు చేసిన అంశాన్ని లేఖలో ప్రస్తావించారు. డిసెంబర్ 31వ తేదీన తుది వాదనలు ముగిసిన ఈ అంశంలో హైకోర్టు తన తీర్పును రిజర్వు చేసిందని పేర్కొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ. కేసులో ఏసీబీ కూడా ప్రతివాదిగా ఉన్నారని, ఈ అంశంలో సుదీర్ఘమైన వాదనలను వినిపించిన ఏసీబీ అని గుర్తు చేశారు.
హైకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసి ఏ క్షణమైనా తీర్పును ప్రకటించే అవకాశం ఉన్న సందర్భంలో తనకు ఏసీబీ నోటీసు ఇచ్చిందని చెప్పారు. మొన్నఏసీబీ తనకు ఇచ్చిన నోటీసులో ఇవాళ సమాచారం అందించాలని, సమాచారంతోపాటు, డాక్యుమెంట్లను అందివ్వాలని ఏసీబీ కోరిందని చెప్పారు. ఏ అంశాల పైన సమాచారం కావాలో అన్న విషయాన్ని ఏసీబీ నోటీసులో స్పష్టంగా ప్రస్తావించలేదన్న చెప్పారు. ఏయే అంశాలు తాలూకు డాక్యుమెంట్లు అడుగుతున్నారో కూడా నోటీసులో తెలపలేదని చెప్పారు.
మరోసారి నోటీసులిస్తం
కేటీఆర్ తీరుపై ఏసీబీ అధికారులు స్పందించారు. కేటీఆర్ కావాలనే రోడ్డుపై హైడ్రామా క్రియేట్ చేశాని చెప్పారు. న్యాయవాదులను తీసుకొని వచ్చి విచారణ నుంచి తప్పించుకునేందుకు యత్నించారని అన్నారు. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని చెప్పారు. దర్యాప్తునకు సహకరించాలని హైకోర్టు చెప్పినా ఆయన వినలేదని ఆరోపించారు. మరోమారు కేటీఆర్ కు నోటీసులు అందజేస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. దీనిపై హైకోర్టును సైతం ఆశ్రయించనున్నట్టు ఏసీబీ అధికారులు చెప్పారు.
ALSO READ | ఆరాంఘర్ ఫ్లై ఓవర్‌కు మన్మోహన్ సింగ్ పేరు