హైదరాబాద్ లో ఇంకా హాఫ్​ డే స్కూల్స్... సరిపోని గదులు.. కారిడార్లలో క్లాసులు

హైదరాబాద్ లో ఇంకా  హాఫ్​ డే స్కూల్స్... సరిపోని గదులు.. కారిడార్లలో క్లాసులు
  • క్లాస్​రూముల కొరతతో షిఫ్ట్​ స్కూళ్ల కొనసాగింపు
  • 46 బిల్డింగుల్లో 93 పాఠశాలల నిర్వహణ
  • రెండు చోట్ల ఒకే బిల్డింగులో మూడు స్కూల్స్​ 
  • ఇంగ్లీష్​, తెలుగు మీడియం పిల్లల్ని  క్లబ్​ చేసి పాఠాలు 

 హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో ఇంకా హాఫ్​ డే స్కూల్స్​ రన్ ​అవుతున్నాయి. తరగతి గదుల కొరత, సొంత బిల్డింగులు లేకపోవడంతో షిఫ్ట్​ స్కూల్స్ ​అని పేరు పెట్టి నడిపిస్తున్నారు. చాలా షిఫ్ట్ స్కూళ్లలో క్లాసు రూములు లేక కారిడార్లలో తరగతులు నిర్వహించాల్సి వస్తోంది. మరికొన్ని చోట్ల ఇంగ్లీష్​, తెలుగు మీడియం పిల్లలను క్లబ్​ చేసి పాఠాలు చెబుతున్నారు.

దీంతో పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్​ అందక ఫలితాలు తారుమారవుతున్నాయి. అయితే, షిఫ్ట్ స్కూళ్లను జనరల్​స్కూళ్లుగా మార్చాలని అధికారులు ప్రయత్నిస్తున్నా పూర్తి స్థాయిలో సక్సెస్ ​కాలేకపోతున్నారు. 

కలెక్టర్​ ఆదేశాలతో...

షిఫ్ట్ స్కూళ్లను సాధ్యమైనంత వరకు జనరల్ స్కూళ్లుగా మార్చాలని కలెక్టర్​ అనుదీప్ దురిశెట్టి గతంలో అధికారులను ఆదేశించారు. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారులు షిష్ట్ స్కూళ్లను విజిట్​చేసి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. స్కూళ్లలో స్టూడెంట్స్​ సంఖ్య, క్లాస్​రూముల సంఖ్య, టాయిలెట్స్ తదితర అంశాల ఆధారంగా జనరల్ స్కూల్స్​గా మారుస్తున్నారు.

అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా రూమ్స్​కు రిపేర్లు చేయడంతో కొన్ని చోట్ల అదనపు క్లాస్​రూమ్స్​ అందుబాటులోకి వచ్చాయి. అవకాశం లేని చోట కంప్యూటర్​ రూమ్స్, సైన్స్​ల్యాబ్స్​, లైబ్రరీ, స్టోర్​రూమ్స్​ను  ఖాళీ చేయించి క్లాస్​రూమ్స్​గా మార్చి జనరల్ స్కూల్స్​ చేస్తున్నారు. అయితే, మెజారిటీ స్కూళ్లలో క్లాస్​రూముల కొరత ఉండడంతో కొన్ని స్కూళ్లనే జనరల్​షిఫ్ట్​కు మార్చారు. 

గతంలో తరగతి గదులు సరిపోక...

గతంలో ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లలు ఎక్కువగా ఉండడంతో క్లాసు రూమ్స్​ సరిపోక షిఫ్ట్ విధానాన్ని తీసుకువచ్చారు. దీని ప్రకారం ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు ప్రైమరీ, మధ్యాహ్నం12.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హైస్కూల్​నడిపిస్తున్నారు.

కొన్నిచోట్ల స్కూళ్లకు బిల్డింగ్స్​లేక రిలొకేట్​ చేసి వేరే ప్రాంతంలోని స్కూల్ భవనాల్లోకి తరలించడం వల్ల , కొన్ని పాఠశాలల్లో సింగిల్ టాయిలెట్స్​ లేక షిఫ్ట్ స్కూల్స్​గా మార్చాల్సి వచ్చింది. 20, 30 ఏండ్ల నుంచి షిఫ్ట్ స్కూళ్లుగా కొనసాగుతున్నవి కూడా నగరంలో ఉండడం గమనార్హం. ఇలా ఒకే బిల్డింగ్​లో వేరు, వేరు సమయాల్లో  ప్రైమరీ స్కూల్​, హైస్కూల్​ నిర్వహిస్తున్నారు. 

మెజారిటీ స్కూళ్లలో క్లాస్​రూమ్స్​ కొరత 

సిటీలోని 46 స్కూల్​ బిల్డింగుల్లో 93 పాఠశాలలను నడిపిస్తున్నారు. రెండు చోట్ల ఒకే బిల్డింగ్​లో మూడు స్కూళ్లు కూడా నడుస్తున్నాయి. మిగతా చోట్ల ప్రైమరీ, హైస్కూళ్లను షిఫ్ట్ ల వారీగా నడుపుతున్నారు. వీటిల్లో కొన్ని రెంటెడ్​ బిల్డింగ్స్ లో ఉండడంతో కనీసం రిపేర్లకు కూడా నోచుకోవడం లేదు. ఓల్డ్​సిటీలోని చాలా స్కూళ్లను మరీ తక్కువ స్థలంలో నిర్వహిస్తున్నారు. స్కూళ్లలో ఇప్పటికీ క్లాసురూమ్స్​ సరిపోక కారిడార్లలో తరగతులు నిర్వహిస్తున్నారు.

మరికొన్ని స్కూళ్లలో అయితే, ఇంగ్లీషు, తెలుగు మీడియం స్టూడెంట్లను ఒకే తరగతిలో కూర్చొబెట్టి పాఠాలు చెప్తున్నారు. కలెక్టర్​ఆదేశాల మేరకు ఈ మధ్యే పాటిగడ్డ, బేగంపేట, గడ్డి అన్నారం తదితర ప్రాంతాల్లోని స్కూళ్లను డీఈవో జనరల్​స్కూల్స్​గా మార్చగా..ఆసిఫ్​నగర్​లోని టప్పాచబుత్ర, జెబాబాగ్​ స్కూళ్లను జనరల్ స్కూళ్లుగా మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.   

పిల్లల చదువుపై ప్రభావం

షిఫ్ట్ స్కూల్​ టైమింగ్స్​ వల్ల స్టూడెంట్స్​ దారి తప్పుతున్నారు. షిఫ్ట్ స్కూళ్లలో హైస్కూల్​ పిల్లలకు మధ్యాహ్నం నుంచి క్లాసులు ప్రారంభమవుతుండడంతో ఉదయం సమయంలో వారు ఖాళీగా ఉంటున్నారు. దీంతో కొందరు పార్ట్ టైం జాబ్స్​కూడా చేస్తున్నారు. మరికొందరు పిల్లలు రోడ్లపై తిరుగుతూ తప్పు దారి పడుతున్నారు. అలాగే జనరల్ ​స్కూళ్లలో ఒక్క పీరియడ్​టైమ్ 45 నిమిషాలుంటే, షిఫ్ట్ స్కూళ్లలో 30 నిమిషాలు మాత్రమే. దీంతో చాలా స్కూళ్లలో సిలబస్​ పూర్తికాక, సబ్జెక్ట్​ అర్థం కాక రిజల్ట్​ లో తేడా వస్తోంది.  

సాధ్యమైనంత వరకు మారుస్తున్నం

కలెక్టర్​ ఆదేశాలతో షిష్ట్ స్కూళ్లను జనరల్​స్కూళ్లుగా మారుస్తున్నం. గతేడాది కొన్ని స్కూళ్లను మార్చాం. ఈ ఏడాది షిఫ్ట్ స్కూళ్లను విజిట్​చేసి జనరల్ గా మార్చేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నాం. కొన్ని స్కూళ్లలో పిల్లల సంఖ్య తగ్గడం, అమ్మ ఆదర్శ పాఠశాల స్కీమ్​ ద్వారా కొన్ని రూమ్స్​కు రిపేర్లు చేసి మార్చాం.

సికింద్రాబాద్, సైదాబాద్, బండ్లగూడ మండలాల్లోని స్కూళ్లను షిష్ట్ నుంచి చేంజ్​చేశాం. ముందు ముందు ఇంకాకొన్ని స్కూళ్లను కూడా జనరల్ స్కూళ్లుగా మారుస్తం. 

– ఆర్.రోహిణి, హైదరాబాద్ డీఈఓ