అర ఎకరం పొలం ఉన్న రైతు, ఎంత పంట పండిస్తే మాత్రం, ఏమంత సంతోషం కలుగుతుంది.. ? అని ఎవరైనా అనుకుంటూ ఉంటే, వారు నిస్సందేహంగా పప్పులో కాలేసినట్లే. ఒకటికి పదహారు పంటలు పండిస్తే.. ఆ కుటుంబం ఆనందంగా జీవించడమే కాదు, ఆర్ధికంగా నిలదొక్కుకోవచ్చని నిరూపిస్తున్నారు.. . అర ఎకరం 16 రకాల కూరగయా పంటలు పండిస్తూ.. మంచి లాభాలను ఆర్జిస్తున్నారు.తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రైతు గోవిందు..
మారుతున్న కాలానికి అనుగుణంగా, పంటల సరళిని మార్చుతున్నారు రైతులు. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటలను సాగు చేసి మంచి లాభాలను గడిస్తున్నారు. ఇందకు నిదర్శనమే రైతు గోవిందు. తనకున్న 40 సెంట్ల భూమిలో వంగసాగు చేపట్టారు. ఇందులో అంతర పంటలుగా ఉల్లి, చిక్కుడు, వేరుశనగ, దోస, ముల్లంగి, బెండ, క్యారెట్, బీరతో పాటు, పలు రకాల ఆకూరలను సాగు చేస్తున్నారు. గతంలో రసాయనిక ఎరువులతో పండిచేవారు. అయితే పెట్టుబడి ఖర్చులు పెరిగేవి .. లాభాలు అంతగా వచ్చేకావు. వ్యవసాయ అధికారులు సూచనల మేరకు ఈ ఏడాది ప్రకృతి విధానంలో సాగు చేపట్టారు.
పంటలకు జీవామృతం, నీమాస్త్రం అందిస్తున్నారు. చీడపీడల నివారణకు పుల్లటి మజ్జిగ, అమ్మినోయాసిడ్స్ పిచికారి చేస్తున్నారు. పంటలు మంచి ఆరోగ్యంగా పెరిగాయి. ప్రస్తుతం కొన్ని పంటలు పూత, కాత దశలో ఉండగా.. మరి కొన్ని దిగుబడులు వచ్చాయి. ఉల్లిలో ఆదాయం రూ.2 వేలు, వేరుశనగలో ఆదాయం రూ. 2 వేలు, ఆకు కూరలపై 2 వేలు ఇలా అర ఎకరంలో మొత్త ఆదాయం 25 నుండి 35 వేల వరకు వస్తోంది. మార్కెట్‌లో ఒక పంటకు ధర తగ్గినా.. మరో పంటకు ధర ఎక్కువగా పలుకుతుండటంతో నష్టం వచ్చే పరిస్థితి లేదంటున్నారు రైతు గోవిందు.