న్యూఢిల్లీ: దేశంలోని మొత్తం కరోనా కేసుల్లో సగం కేసులు నాలుగో విడత లాక్ డౌన్ లోనే నమోదయ్యాయి. మే 18 నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు 85,974 పాజిటివ్ కేసులు వచ్చాయి మొత్తం కేసుల్లో 47.20 శాతం ఈ టైమ్ లోనే రికార్డైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా చెబుతోంది. మొదటి లాక్ డౌన్ మార్చి 25 నుంచి మొదలై 21 రోజులపాటు కొనసాగింది. అప్పుడు 10,877 కేసులు వచ్చాయి. రెండో విడత ఏప్రిల్ 15 నుంచి మొదలై మే 3 వరకు కొనసాగితే.. 31,094 కేసులు నమోదయ్యాయి. థర్డ్ ఫేజ్ 14 రోజలపాటు కొనసాగి మే 17న ముగిసింది. ఈ సమయంలో 56,636 మందికి పాజిటివ్ వచ్చింది. కరోనా కేసుల్లో ప్రపంచంలో మన దేశం తొమ్మిదో స్థానంలో ఉంది. మన దేశంలో మొదటి కరోనా కేసు కేరళలో నమోదైంది. వుహాన్ యూనివర్సిటీ నుంచి తిరిగి వచ్చిన స్టూడెంట్ కు పాజిటివ్ గా తేలింది. మార్చి 24 వరకు 512 మందికి కరోనా సోకింది. ఆదివారం ఒక్కరోజే అత్యధికంగా 8,380 కేసులు నమోదయ్యాయి. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,82,143కు చేరింది. ఇప్పటివరకు 5,164 మంది మరణించారు. 89,995 యాక్టివ్ కేసులు ఉండగా, 86,983 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 47.75 శాతం మంది కరోనా నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారి ఒకరు చెప్పారు. ఆదివారంతో నాలుగో విడత లాక్ డౌన్ ముగిసింది. జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ శనివారమే కేంద్రం ప్రకటించింది. జూన్ 8 నుంచి అమలయ్యేలా అన్ లాక్ 1 పేరుతో గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది.