కుంభమేళాకు సగం మంది సనాతన ధర్మం ఫాలోవర్లు: సీఎం యోగి ఆదిత్యనాథ్

కుంభమేళాకు సగం మంది సనాతన ధర్మం ఫాలోవర్లు: సీఎం యోగి ఆదిత్యనాథ్

ప్రయాగ్​రాజ్/మహాకుంభ్‌‌‌‌ నగర్: ప్రపంచంలోని సగం మంది సనాతన ధర్మ ఫాలోవర్లు మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు చేశారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. సనాతన ధర్మాన్ని ఆచరించే 120 కోట్ల మందిలో ఇప్పటి వరకు 62 కోట్ల మంది కుంభమేళాలో స్నానం చేశారని ఆయన తెలిపారు. ఆదివారం మహాకుంభ్ నగర్‎లో మహాకుంభ్ మేళా మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య విజయేంద్ర సరస్వతి హాజరయ్యారు. కార్యక్రమంలో సీఎం యోగి మాట్లాడుతూ.. ప్రపంచంలోనే ఇంతపెద్ద మతపరమైన కలయిక భారత్‎లో తప్ప మరెక్కడుందన్నారు.

‘‘కుంభమేళాకు భక్తులు భారీ సంఖ్యలో వస్తున్నారు. సనాతన ధర్మాన్ని ఆచరించే వారు తమ గురువులు, రుషి సంప్రదాయానికి కృతజ్ఞతలు చెప్పేందుకు కుంభమేళా ఒక వేదికగా మారింది. అలాగే, సనాతన ధర్మాన్ని ప్రమోట్ చేయడంలో కంచి కామకోటి పీఠాధిపతి ఎప్పుడూ ముందుంటారు. కంచి కామకోటి పీఠం ప్రభావం దేశవ్యాప్తంగా విస్తరించి మన సనాతన ధర్మాన్ని మరింత బలోపేతం చేస్తున్నది. సనాతన ధర్మానికి ముప్పు వాటిల్లిన ప్రతీసారి.. రక్షించడానికి పీఠం ముందుకు వచ్చింది” అని యోగి పేర్కొన్నారు. 

ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, ఆ రాష్ట్ర గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మిత్ సింగ్ (రిటైర్డ్), ఒడిశా సీఎం మోహన్ చరణ్ ఆదివారం కుంభమేళాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి మాట్లాడుతూ.. మహాకుంభమేళా విజయవంతం కావడంపై కొంతమంది ప్రతిపక్ష నేతలు జీర్ణించుకోవడం లేదని అన్నారు. అందుకే త్రివేణీ సంగమంలోని నీటి నాణ్యతపై వారు ప్రశ్నలు లేవనెత్తుతున్నారని మండిపడ్డారు. 

‘‘ఇప్పటికే 60 కోట్ల మంది కుంభమేళాలో స్నానం చేశారు. నేను కూడా పుణ్యస్నానం చేశాను. అయితే.. కొంతమంది ఇతరుల మతపరమైన భావోద్వేగాలను హర్ట్  చేయాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కుంభమేళా గురించి వదంతులు వ్యాప్తి చేస్తున్నారు. సీఎం యోగి అద్భుతంగా ఏర్పాట్లు చేశారు” అని ధామి పేర్కొన్నారు. అలాగే, గవర్నర్ గుర్మిత్  సింగ్, ఒడిశా సీఎం మోహన్ చరణ్ కూడా ఏర్పాట్లపై హర్షం వ్యక్తం చేశారు. ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని యోగి సర్కారుకు, అధికారులకు గుర్మిత్ అభినందనలు తెలిపారు. బీజేపీ లీడర్ సంబిత్ పాత్ర, ప్రముఖ సూఫీ సింగ్ కైలాష్​ఖేర్ కూడా కుంభమేళాలో పాల్గొన్నారు. 

కొనసాగుతున్న ట్రాఫిక్  కష్టాలు

ఈనెల 26న మహాశివరాత్రి రోజు కుంభమేళా ముగియనుండడంతో భక్తులు భారీ సంఖ్యలో మేళాకు తరలివెళ్తున్నారు. దీంతో ఆదివారం ప్రయాగ్ రాజ్ సిటీతో పాటు ఆ నగరానికి వెళ్లే రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. కిలోమీటర్ల దూరం వరకూ ట్రాఫిక్ జాంలతో భక్తులు అవస్థలు పడ్డారు. 

14 వేల రైళ్ల రాకపోకలు

కుంభమేళాలో పాల్గొనే భక్తుల కోసం రైల్వేశాఖ ఇప్పటి వరకు 14 వేల రైళ్లను నడిపింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 12 కోట్ల నుంచి 15 కోట్ల మంది భక్తులు ఆ రైళ్లలో రాకపోకలు చేశారు. మేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రయాగ్ రాజ్, సమీపంలోని స్టేషన్లకు 14 వేల ట్రైన్లు చేరుకున్నాయని అధికారులు తెలిపారు.