గ్రూప్ 1 తుది జాబితా అభ్యర్థుల హాల్ టికెట్లు బయటపెట్టాలి ...నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతిలాల్ నాయక్

గ్రూప్ 1 తుది జాబితా అభ్యర్థుల హాల్ టికెట్లు బయటపెట్టాలి ...నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతిలాల్ నాయక్
  • వారికి అన్ని ర్యాంకులు ఎలా సాధ్యం?

ఓయూ, వెలుగు: గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతిలాల్ నాయక్ ఆరోపించారు. జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఓయూలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రూప్ వన్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు వేర్వేరుగా హాల్ టికెట్లు ఎందుకు జారీ చేశారని ప్రశ్నించారు. తుది జాబితాలోని అభ్యర్థుల మెయిన్స్, ప్రిలిమ్స్ హాల్ టికెట్ నంబర్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

కోటి మహిళా కాలేజీలోని పరీక్షా కేంద్రం 18, 19 (కేవలం మహిళ అభ్యర్థులు కోసం ప్రత్యేక పరీక్షా కేంద్రం) లో ఎగ్జామ్ రాసిన వారికి అన్ని ర్యాంకులు ఎలా వచ్చాయన్నారు. 654 మందికి ఒకే ర్యాంకు, అది కూడా ఒకరి వెనకాల ఒకరు కూర్చున్న వాళ్లకు ఎలా వస్తాయో టీజీపీఎస్సీ అధికారులే చెప్పాలన్నారు. 

ఉర్దూ మీడియంలో మొత్తం 9 మంది పరీక్ష రాస్తే అందులో ఏడుగురికి 450కి పైగా మార్కులు రావడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. పరీక్షా పత్రాలు మూల్యాంకనం చేసిన వారి పూర్తి వివరాలను బహిర్గతం చేయాలన్నారు. ఈ సందేహాలను నివృత్తి చేయకుండా ఉద్యోగ భర్తీ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెయ్యి మందితో ఢిల్లీలో ధర్నా చేస్తామని 
హెచ్చరించారు.