గ్లోబల్ టెర్రరిస్ట్, హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్య

గ్లోబల్ టెర్రరిస్ట్, హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్య

 గ్లోబల్ టెర్రరిస్ట్, పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో హత్యకు గురయ్యాడు. ఈ విషయాన్ని అక్కడి రివల్యూషనరీ గార్డ్స్  తెలిపారు. మరోవైపు హనీయే మరణం పట్ల సంతాపం తెలుపుతూ హమాస్ ప్రకటన విడుదల చేయడంతో ఇస్మాయిల్ హనియే మృతి నిర్ధారణ అయింది. ఖతార్‌లో నివసిస్తున్న ఇస్మాయిల్‌ హనియే ఇరాన్‌ నూతన అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇరాన్ వెళ్లగా ఈ  హత్య జరిగింది. ఇరాన్ అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగించుకుని ఇస్మాయిల్ హనియే  టెహ్రాన్‌లోని తన ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ హత్య జరిగింది.

మరోవైపు ఇజ్రాయెల్‌ నిఘా సంస్థనే ఈ హత్య చేసిందని సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇస్మాయిల్‌ హనియేను హతమారుస్తామని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజామిన్‌ నెతన్యాహు గతంలోనే ప్రకటన చేయడం ఈ అనుమానాలకు ప్రధాన కారణం. కాగా హనియేను ఎవరు హత్య చేశారు..? ఎలా హత్య చేశారు..? లాంటి వివరాలను ఇరాన్‌ ఇంకా వెల్లడించలేదు కానీ హత్యపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపింది. 

ఇదిలావుంటే ఇజ్రాయెల్‌, అమెరికా దేశాలు ఇంతవరకు హనియే హత్యపై స్పందించలేదు. హమాస్‌ పొలిటికల్‌ బ్యూరో చీఫ్‌ హత్య నేపథ్యంలో పాలస్తీనా, గాజాలో పరిస్థితి ఆందోళనకరంగా మారనుంది. హమాస్‌, ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది.కాగా ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో జరిగిన మసౌద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత్ నుంచి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు.