హమాస్‌‌‌‌ చీఫ్‌‌‌‌ హత్య.. హనియా మృతిని ధ్రువీకరించిన హమాస్‌‌‌‌

హమాస్‌‌‌‌ చీఫ్‌‌‌‌ హత్య.. హనియా మృతిని ధ్రువీకరించిన హమాస్‌‌‌‌
  • ఇరాన్ రాజధాని టెహ్రాన్​లోని హనియా ఇంటిపై మిసైల్ దాడి 
  • హనియా మృతిని ధ్రువీకరించిన హమాస్‌‌‌‌
  • ఈ దాడి ఇజ్రాయెల్ పనేనన్న హమాస్, ఇరాన్ 
  • ఆ దేశంపై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరిక

టెహ్రాన్: పాలస్తీనా కోసం పోరాడుతున్న హమాస్‌‌‌‌ మిలిటెంట్ సంస్థ చీఫ్‌‌‌‌ ఇస్మాయిల్‌‌‌‌ హనియా హత్యకు గురయ్యారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌‌‌‌లోని ఇంటిపై మంగళవారం జరిగిన దాడిలో అతడు చనిపోయినట్టు హమాస్​గ్రూప్ ధ్రువీకరించింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కూడా ఇస్మాయిల్​మరణాన్ని కన్​ఫర్మ్ ​చేసింది. ఈ దాడిలో ఇస్మాయిల్​తో పాటు అతని బాడీగార్డ్‌‌‌‌ కూడా మృతి చెందినట్టు వెల్లడించింది. 

దాడికి సంబంధించి మరిన్ని వివరాల కోసం దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది. ఖతర్ రాజధాని దోహాలో నివసిస్తున్న హనియా.. మంగళవారం ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు టెహ్రాన్‌‌‌‌కు వెళ్లారు. ప్రమాణస్వీకారం తర్వాత టెహ్రాన్ లోని అతని ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత సరిగ్గా అదే ఇంటిపై వైమానిక దాడి జరగడంతో అతడు చనిపోయాడు. 

హనియా హత్యకు ఇజ్రాయెలే కారణమని హమాస్ ఆరోపించింది. ఇది కుట్ర పూరిత చర్య అని, హమాస్ సంకల్పాన్ని విచ్ఛిన్నం చేయాలనే లక్ష్యంతో ఈ హత్య చేశారని హమాస్ సీనియర్ లీడర్ సమీ అబు జుహ్రీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌‌‌‌పై తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. దేశ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి వచ్చిన కీలక నేతను, తమ దేశ రాజధానిలోనే మట్టుబెట్టడం ఇరాన్ కు గట్టి ఎదురుదెబ్బలా నిలిచింది. దీంతో ఇజ్రాయెల్ పై తగిన ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కూడా హెచ్చరించారు. అయితే, హనియా హత్య విషయంపై ఇజ్రాయెల్ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. 

బీరుట్​లో హిజ్బుల్లా కమాండర్ ​హతం

ఇజ్రాయెల్‌‌‌‌లోని గోలన్ హైట్స్‌‌‌‌లో శనివారం ఓ ఫుట్‌‌‌‌బాల్ మైదానంపై రాకెట్ దాడిలో 12 మంది మృతి చెందిన ఘటనకు సూత్రధారి అయిన హిజ్బుల్లా కమాండర్ ఫువాద్​ షుక్ర్ ను ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. లెబనాన్​లోని బీరుట్‌‌‌‌లో అతడు దాగి ఉన్న ప్రాంతంపై మంగళవారం తమ ఫైటర్ జెట్‌‌‌‌లతో దాడి చేసి.. అతన్ని మట్టుబెట్టాయని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. 

కాగా, ఈ ఘటనపై అమెరికా వైస్ ​ప్రెసిడెంట్, అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ స్పందించారు. టెర్రరిజం నుంచి తనను తాను రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్‌‌‌‌కు ఉందన్నారు. పరోక్షంగా ఫువాద్ ​షుక్ర్ హత్యను ఆమె సమర్ధించారు. కాగా,1983లో బీరుట్​లోని యూఎస్​ మెరైన్ ​బ్యారెక్స్​పై బాంబు దాడి ఘటనలో ఫువాద్​ షుక్ర్ ప్రమేయం ఉంది.  అప్పటి నుంచి అతడు అమెరికా వాంటెడ్ ​లిస్టులో ఉన్నాడు. 

ఎవరీ హనియా? 

ఇస్మాయిల్ హనియా1963లో గాజా సిటీకి సమీపంలోని ఓ శరణార్థి శిబిరంలో జన్మించాడు. 1987లో హమాస్​లో చేరాడు. హమాస్ వ్యవస్థాపకుడు అహ్మద్ యాసిన్ కు అత్యంత సన్నిహితుడిగా మారాడు. 2004లో ఇజ్రాయెల్ దాడుల్లో అహ్మద్ యాసిన్ హతమైన తర్వాత హమాస్​లో హనియా కీలక పాత్ర పోషించాడు. 2017లో హమాస్ చీఫ్ గా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత అమెరికా అతడిని ప్రపంచ టెర్రరిస్టుల జాబితాలో చేర్చింది.

 అయితే, హనియా సారథ్యంలోనే హమాస్ అతి శక్తిమంతమైన సంస్థగా ఎదిగింది. గాజాపై హమాస్ కు తిరుగులేని పట్టు సాధించడంలో ఈయనే ప్రధాన వ్యూహకర్తగా నిలిచాడు.