
- బదులుగా 369 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసిన ఇజ్రాయెల్
జెరూసలెం:గాజా కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్..శనివారం ఓ అమెరికన్‌తో సహా ముగ్గురు బందీలను విడుదల చేసింది. 498 రోజులుగా బందీలుగా ఉన్న ఇయర్ హార్న్(46), సాగుయ్ డెకెల్-చెన్(36), సాషా (అలెగ్జాండర్) ట్రౌఫానోవ్(29)లను- ఖాన్ యూనిస్‌లోని ఓ వేదికపై సాయుధ హమాస్ టెర్రరిస్టులు వారిని రెడ్‌క్రాస్‌కు అప్పగించారు.
ఇందుకు బదులుగా 369 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ రిలీజ్ చేసింది. కాగా, పాలస్తీనా గ్రూపు.. ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని ఇటీవల ఆరోపించింది. దీంతో తాము పోరాటాన్ని తిరిగి ప్రారంభిస్తామని హెచ్చరించింది. అయితే, వారి బెదిరింపులను అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ తీవ్రంగా పరిగణించాయి.
వారం రోజుల్లో బందీలను విడుదల చేయకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఈజిప్షియన్, ఖతారీ మధ్యవర్తులు పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య ప్రతిష్టంభనను నివారించడానికి నిరంతరం ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో హమాస్ శనివారం ముగ్గురు బందీలను విడుదల చేసింది.
ఎట్టకేలకు ఇజ్రాయెల్ రాష్ట్రానికి తిరిగి వచ్చిన ఆ ముగ్గురు బందీలకు ఇజ్రాయెల్ రక్షణ దళాలు సెల్యూట్చేశాయి. కాగా, ఇంతకాలం బందీలుగా ఉన్న ముగ్గురు కొంత బలహీనంగా కనిపించారు. వారిని ఆస్పత్రికి తరలించి.. ప్రాథమిక చికిత్స అందించనున్నట్టు ఇజ్రాయెల్ రక్షణ దళాలు తెలిపాయి.