గాజా: బందీలను విడుదల చేయాలంటే ముందుగా గాజాలో యుద్ధం ఆపేయాలని, ఆ తర్వాతే బందీలను విడుదల చేస్తామని హమాస్ స్పష్టం చేసింది. యుద్ధం కొనసాగిస్తూనే బందీలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తే కుదరదని తేల్చిచెప్పింది. ‘‘గాజాలో ఏడాదిగా మా ప్రజలపై ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది. ఈ దాడుల్లో ఎంతోమంది అమాయకులు చనిపోయారు. అలాగే, మావాళ్లను ఇజ్రాయెల్ పట్టుకున్నది.
వారిని వెంటనే విడిచిపెట్టి, గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలను వెనక్కి పిలిపించుకోవాలి. దాడులను ఆపేయాలి. అప్పుడే మేము బందీలను విడుదల చేస్తాం” అని హమాస్ లీడర్ ఖలీల్ అల్ హయా ఒక వీడియోలో పేర్కొన్నాడు. అలాగే ఇజ్రాయెల్ బలగాల దాడుల్లో తమ చీఫ్ యహ్యా సిన్వార్ చనిపోయింది నిజమేనని అతను స్పష్టం చేశాడు. కాగా, యహ్వా సిన్వార్.. హమాస్ నాయకుడు. ఈ ఏడాది ఆగస్టులో హమాస్ పొలిటికల్ బ్యూరో చైర్మన్ గా అతను వ్యవహరించాడు.
ఇస్మాయెల్ హనియా తర్వాత 2017 ఫిబ్రవరిలో గాజాలో హమాస్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టాడు. గాజాలోని ఖాన్ యూనిస్ శరణార్థి శిబిరంలో 1962లో అతను పుట్టాడు. ఆ సమయంలో గాజా.. ఈజిప్టు పాలనలో ఉంది. యహ్యా సిన్వార్ గాజా ఇస్లామిక్ యూనివర్సిటీలో చదివాడు.