- హమాస్ హెచ్చరిక
- గాజాలో కాల్పుల విరమణ, బందీల విడుదల కోసం యూఎస్ తీర్మానాన్ని ఆమోదించిన యూఎన్ఎస్సీ
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్–హమాస్ మధ్య పోరు ఉధృతమైంది. హమాస్ చెరలో ఉన్న బందీలను విడిపించేందుకు ఇజ్రాయెల్ సైన్యం దూకుడు పెంచగా.. హమాస్ తీవ్ర హెచ్చరికలు జారీచేసింది. ఇజ్రాయెల్ బలగాలు దూకుడు తగ్గించకుండా ముందుకు దూసుకొస్తే బందీలను కాల్చేయాలని హమాస్ తన సభ్యులకు ఆదేశాలు జారీచేసినట్టు ఇంటర్నేషనల్ మీడియా వెల్లడించింది.
హమాస్ మిలిటెంట్లు బందీలుగా ఎత్తుకెళ్లినవారి కోసం గాజాలో ఇజ్రాయెల్ సైన్యం ఆపరేషన్ చేపట్టింది. గాజాపై భారీ ఎత్తున బాంబులతో విరుచుకుపడుతోంది. తాజాగా, శనివారం సెంట్రల్ గాజాలోని నుసెయిరత్నుంచి నలుగురు బందీలను ఇజ్రాయెల్ డిఫెన్స్‌ఫోర్సెస్ (ఐడీఎఫ్) రక్షించింది. మరికొంతమందిని రక్షించేందుకు ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో హమాస్ అగ్రనేతలు తీవ్ర హెచ్చరికలు జారీచేశారు.
హమాస్ చెరలోనే ఇంకొంతమంది
నిరుడు అక్టోబర్7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై మెరుపు దాడి చేశారు. 200 మందిని బందించి, గాజాకు తరలించారు. కాగా, వీరిని రక్షించేందుకు ఇజ్రాయెల్‌లోని బెంజమిన్ నెతన్యాహు సర్కారు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో నవంబర్‌లో ఇరుపక్షాల మధ్య కాల్పుల ఒప్పంద విరమణ ప్రకారం ఏడుగురు బందీలను హమాస్ విడుదల చేసింది.
తాజాగా, ఇజ్రాయెల్ దాడి చేసి మరో నలుగురిని విడిపించుకున్నది. కొంతమంది బందీలు హమాస్ చేతిలో చనిపోగా.. ఇంకొందరు ఇంకా బందీలుగానే ఉన్నారని ఇజ్రాయెల్ చెబుతోంది. వీరి ఆచూకీని గుర్తించి, విడిపించేందుకు ఇజ్రాయెల్ సైన్యాలు అమెరికా ఇంటెలిజెన్స్‌తో కలిసి డ్రోన్లు, శాటిలైట్లు, ఇతర కమ్యూనికేషన్ సాధనాలతో గాలింపు చేపట్టాయి. గాజాపై వైమానిక దాడికి దిగాయి.
అమెరికా తీర్మానాన్ని ఆమోదించిన యూఎన్ఎస్సీ
గాజాలో కాల్పుల విరమణ, బందీల విడుదల కోసం అమెరికా ప్రతిపాదించిన తీర్మానాన్ని యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్(యూఎన్ఎస్సీ) ఆమోదించింది. ఈ తీర్మానానికి 14 ఓట్లు అనుకూలంగా రాగా.. రష్యా ఓటింగ్‌కు దూరంగా ఉన్నది. ఈ సంధి ప్రతిపాదనకు ఇజ్రాయెల్ఇప్పటికే ఒకే చెప్పింది. యూఎన్ఎసీసీ ఓట్‌పై హమాస్‌కూడా స్పందించింది. ఈ ఓటింగ్‌ను తాము స్వాగతిస్తున్నట్టు హమాస్ నేతలు పేర్కొన్నారు. అయితే, దీనికి శాశ్వత ముగింపు ఉండాలని షరతు విధించారు. దీనికి ఇజ్రాయెల్ అంగీకరించలేదు. హమాస్‌ను పూర్తిగా నాశనం చేసి, బందీలను విడిపించుకోవాలనే పట్టుదలతో ఉన్నది.