తిరువనంతపురం: కేరళలోని మలప్పురంలో శుక్రవారం జమాతే ఇస్లామీకి చెందిన సాలిడారిటీ యూత్ మూవ్ మెంట్ సంస్థ నిర్వహించిన ర్యాలీలో హమాస్ లీడర్ ఖాలిద్ మాషల్ వర్చువల్ స్పీచ్ ను ప్రసారం చేయడం వివాదానికి దారి తీసింది. పాలస్తీనియన్లకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో హమాస్ టెర్రరిస్ట్ సంస్థ లీడర్ స్పీచ్‌ను ప్రసారం చేస్తుంటే పోలీసులు, కేరళ సీఎం పినరయి విజయన్ ఏం చేస్తున్నారంటూ ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ కె.సురేంద్రన్ మండిపడ్డారు.
ర్యాలీ నిర్వాహకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన ట్విట్టర్ లో డిమాండ్ చేశారు. పాలస్తీనాకు సంఘీభావం నెపంతో వారు టెర్రరిస్ట్ సంస్థను కీర్తించారని, దాని లీడర్లను యోధులు అంటూ పొగిడారని ఆరోపించారు. అలాగే గురువారం ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నిర్వహించిన ర్యాలీలో కాంగ్రెస్ నేత శశిథరూర్ పాల్గొన్నారని.. ఆ ర్యాలీలో మన దేశానికి వ్యతిరేకంగా, హమాస్‌కు అనుకూలంగా నినాదాలు చేశారనీ సురేంద్రన్ ఆరోపించారు.