అన్సారీపై బీజేపీ విమర్శల దాడి..పాక్ జర్నలిస్టుపై ఆగ్రహం

భారత్ కు సంబంధించిన సున్నితమైన, కీలక సమాచారాన్ని పాకిస్తాన్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI)కు చేరవేశానని పాక్ జర్నలిస్టు నుస్రత్ మీర్జా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ విమర్శల దాడి పెంచింది. ఈ విషయంలో తమకు ఎలాంటి సంబంధం లేదని భారత మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా చెబుతోంది. కాంగ్రెస్ వ్యాఖ్యలను బీజేపీ తప్పుపడుతోంది. 2009లో ఉగ్రవాదంపై జరిగిన ఒక సదస్సులో ఒకే వేదికపై హమీద్ అన్సారీ, పాక్ జర్నలిస్టు నుస్రత్ మీర్జా ఉన్న ఫొటోను బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా విడుదల చేశారు. 

హమీద్ అన్సారీ ఆహ్వానం మేరకు తాను భారత్ ను సందర్శించడంతో పాటు ఆయన్ను కూడా కలుసుకున్నానని పాక్ జర్నలిస్టు నుస్రత్ మీర్జా ఇటీవల చెప్పిన విషయం తెలిసింది. యూపీఏ హయంలో ఐదుసార్లు భారత్ లో పర్యటించిన సందర్భంలో సేకరించిన సున్నితమైన సమాచారాన్ని తమ దేశ గూఢచార సంస్థ అయిన ఐఎస్ఐకు చేరవేశానని సంచలన వ్యాఖ్యలు చేశాడు. నుస్రత్ మీర్జా పాకిస్థాన్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూ క్లిప్‌లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న బీజేపీ ఎదురుదాడికి దిగింది. కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసింది. ఈ ఇష్యూపై స్పందించిన హమీద్ అన్సారీ... తాను ఎప్పుడు జర్నలిస్టు నుస్రత్ మీర్జాను ఆహ్వానించలేదని వివరణ ఇచ్చారు. తనపై వస్తున్న ప్రచారం అబద్దమని చెప్పారు.