సత్తుపల్లి, వెలుగు : ఎన్నికల నిర్వహణకు సరిహద్దు రాష్ట్రాల అధికారులు సమన్వయంతో సహకరించుకోవాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో భద్రాద్రి కొత్తగూడెం, ఏపీలోని ఎన్టీఆర్, ఏలూరు కలెక్టర్లు, ఎస్పీలు సార్వత్రిక ఎన్నికల సరిహద్దు అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖమ్మం కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అసెంబీ ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రలోభాలను నియంత్రించి ఓటర్లు స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సరిహద్దు మండలాలపై గట్టి నిఘా ఉంచాలన్నారు. ప్రజలకు సీ విజిల్ యాప్‌పై అవగాహన కల్పించాలని సూచించారు.
ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాకు 266 కిలోమీటర్ల నిడివితో ఏపీలోని ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల సరిహద్దు ఉందన్నారు. 12 మేజర్ రహదారులపై చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 24 గంటలు నిరంతర నిఘా పెట్టినట్లు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ ప్రియాంక అల మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఏపీలోని ఏలూరు, ఏఎస్‌ఆర్, ఛత్తీస్‌ఘఢ్‌లోని సుక్మా జిల్లాల సరిహద్దులు ఉన్నాయన్నారు. మద్యం రవాణాపై గట్టి నిఘా పెట్టాలన్నారు. కొత్తగూడెం ఎస్పీ వినీత్ మాట్లాడుతూ చెక్‌పోస్టులలో తనిఖీల సమాచారం ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తుందని తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు మాట్లాడుతూ సరిహద్దు జిల్లాల సహకారానికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్టీఆర్ జిల్లా డీసీపీ అజిత మాట్లాడుతూ జిల్లాలో 12 ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఏలూరు జేసీ బీ.లావణ్య వేణి మాట్లాడుతూ తెలంగాణతో ఏలూరు జిల్లాకు 11 సరిహద్దు గ్రామాలు ఉన్నాయన్నారు. 7 చెక్‌పోస్టులు పెట్టి గట్టి నిఘా చేపట్టామని చెప్పారు. సమావేశంలో ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, శిక్షణ సహాయ కలెక్టర్ మయాంక్ సింగ్, అడిషనల్ డీసీపీ ప్రసాదరావు, ఆయా జిల్లాల రెవెన్యూ, పోలీసు, ఎక్సైజ్, బ్యాంకింగ్, కోఆపరేటివ్, అధికారులు పాల్గొన్నారు.