- సీఎంకు లేఖ రాసి యూనివర్సిటీ వీసీ
కర్ణాటక రాష్ట్రంలోని హంపీ కన్నడ విశ్వవిద్యాలయంలో ఓ పరిణామం అధికారులకు షాక్ గురి చేసింది. ఆ యూనివర్సిటీకి అక్షరాలా రూ. కోటి కరెంట్ బిల్లు రావడంతో స్టాఫ్ తలలు పట్టుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వర్సిటీ ఇంత మొత్తంలో బిల్లు చెల్లించడం అసాధ్యమని, బిల్లు మాఫీ చేయాలని కోరుతూ వీసీ డా.డీవీ.పరమశివమూర్తి సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాశారు.
బిల్లు కట్టకపోతే కరెంట్ కట్ చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.కోటి బిల్లు మొత్తం 10 నెలలకు చెందిందని గత ప్రభుత్వ హయాంలోనూ బిల్లులు కట్టలేదని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఇస్తున్న గ్రాంట్లు సరిపోక కరెంట్ బిల్లులు బకాయి పడ్డాయని తెలిపారు. తనకు సాధ్యపడినంత డబ్బు సర్దుబాటు చేస్తున్నానని, కానీ బకాయిలు చెల్లించడానికి తమకు నిధులు కావాలని కోరారు.
వర్సిటీలో సమస్యలెన్నో..
కరెంటు బిల్లుతో పాటు మెయింటెనెన్స్ విషయంలోనూ యూనివర్సిటీ ఇబ్బందులు పడుతోంది. లెక్చరర్ల కొరత, ఉన్న సిబ్బందికి చెల్లించేందుకు నిధులు అందుబాటులో లేకపోవడంతో పాటు విద్యార్థులకు ఎస్సీ, ఎస్టీ స్కాలర్‌షిప్‌ను నిలిపివేసే అవకాశం ఉంది. 72 లెక్చరర్ పోస్టులను కలిగి ఉన్న విశ్వవిద్యాలయంలో కేవలం 45 మంది సిబ్బంది మాత్రమే ఉండగా, 27 ఖాళీగా ఉన్నాయి. కొన్ని డిపార్ట్మెంట్లలో ఒకరు కూడా లేరు. వీటిని భర్తీ చేసి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడేయాలని వీసీ ప్రభుత్వాన్ని కోరారు.