బాల్ పచ్చడైంది : 22 సిక్సులు, 14 ఫోర్లు.. 43 బంతుల్లో 193 పరుగులు

బాల్ పచ్చడైంది : 22 సిక్సులు, 14 ఫోర్లు.. 43 బంతుల్లో 193 పరుగులు

క్రికెట్ లో ఆటగాళ్లు తమదైన రోజున బౌండరీల వర్షం కురిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా టీ20ల్లో వీర ఉతుకుడు ఉతుకుతూ బౌలర్లకు చుక్కలు చూపిస్తారు. అయితే ఇలాంటి ఇన్నింగ్స్ లు ఎన్ని చూసినా.. యూరోపియాన్ లీగ్ లో హమ్జా సలీమ్ దార్ ఇన్నింగ్స్ ధాటికి అసాధారణంగా అనిపించింది. ఈ యంగ్ బ్యాటర్ ధాటికి  బాల్ విలవిల్లాడిపోయింది. మ్యాచ్ చుస్తున్నామా.. హైలెట్స్ చుస్తున్నామా.. అనే అనుమానాన్ని కలిగించాడు. 22 సిక్సులు, 14 ఫోర్లతో 43 బంతుల్లోనే 193 పరుగులు చేసి క్రికెట్ చరిత్రలోనే అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. 

యూరోపియన్ క్రికెట్ లో భాగంగా టీ10 క్రికెట్ లో నిన్న పెద్ద అద్బతమే చోటు చేసుకుంది. డిసెంబర్ 5న కాటలున్యా జాగ్వార్ (CJG),  సోహల్ హాస్పిటల్ (SOH) మధ్య జరిగిన 45వ T10 మ్యాచ్‌లో ఈ సంచలనాత్మక ఫీట్ ఆవిష్కృతమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కాటలున్యా జాగ్వార్ నిర్ణీత 10 ఓవర్లలో ఏకంగా 257 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఇక ఈ మ్యాచ్ లో హమ్జా సలీమ్ దార్ ఆడిన ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఊహకందని ఇన్నింగ్స్ తో క్రికెట్ ను మైమరిపించాడు.

449 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసిన ఈ స్టార్ బ్యాటర్ జట్టు స్కోర్ లో 75 శాతం పరుగులు చేయడం విశేషం. టీ10 క్రికెట్ లో ఏ ఆటగాడికైనా ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్. ఇక ఛేజింగ్ లో సోహాల్ హాస్పిటల్ 8 వికెట్లకు 104 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో కాటలున్యా జాగ్వార్ 153 పరుగుల భారీ స్కోర్ తో గెలిచింది. ప్రస్తుతం హమ్జా సలీమ్ దార్ ఇన్నింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.