
హనుమకొండ కలెక్టరేట్, వెలుగు: మిషన్ వాత్సల్య పథకానికి అర్హులైన వారి జాబితా సిద్ధం చేయాలని హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య ఆఫీసర్లకు సూచించారు. హనుమకొండ కలెక్టరేట్ లో మంగళవారం మిషన్ వాత్సల్య పథకం అర్హుల ఎంపికపై జిల్లాస్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ పథకానికి తల్లిదండ్రులు లేని బాలబాలికలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అర్హుల ఎంపిక ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
సమావేశంలో డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ జయంతి, బాల రక్షా భవన్ జిల్లా కో ఆర్డినేటర్ సిహెచ్ అవంతి, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఇన్చార్జి ఆఫీసర్ ఎస్ ప్రవీణ్ కుమార్, సీడబ్ల్యూసీ మెంబర్ డాక్టర్ పరికి సుధాకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. సుబేదారి ఆర్ట్స్ కాలేజీ ఆడిటోరియంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా యాక్సిలరేట్ యాక్షన్ అనే అంశంపై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్త్రీ, పురుష సమానత్వంతోనే సమాజం పురోగతి సాధిస్తుందన్నారు. కేయూ రిజిస్ట్రార్ ప్రొ.వి.రాంచంద్రం మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను సమాజంలోని బాలికలు, మహిళలను గౌరవించే విధంగా పెంచాలన్నారు. కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి, డీడబ్ల్యూవో జయంతి, కేయూ ఈసీ మెంబర్ డాక్టర్ కె.అనితా రెడ్డి తదితరులున్నారు. అనంతరం కలెక్టరేట్ లో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్రీడా పోటీలను కలెక్టర్ ప్రారంభించారు.