ఏప్రిల్ 22 నుంచి 30 వరకు ఇందిరమ్మ ఇండ్ల వెరిఫికేషన్ : హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య

ఏప్రిల్ 22 నుంచి 30 వరకు ఇందిరమ్మ ఇండ్ల వెరిఫికేషన్ : హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య

హనుమకొండ, వెలుగు: ఈ నెల 22 నుంచి 30వ తేదీ వరకు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల వెరిఫికేషన్ ను పూర్తి చేయాలని ఆఫీసర్లను హనుమకొండ కలెక్టర్​ ప్రావీణ్య ఆదేశించారు. మే 2న గ్రామ పంచాయతీలు, మున్సిపల్​వార్డుల్లో అర్హుల జాబితా ప్రదర్శించాలని సూచించారు. హనుమకొండ కలెక్టరేట్​లో సోమవారం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల మండల స్థాయి వెరిఫికేషన్ ఆఫీసర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మండలానికి నలుగురు వెరిఫికేషన్ ఆఫీసర్లను నియమించినట్లు తెలిపారు.

గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపికకు ఇప్పటివరకు ఇందిరమ్మ కమిటీలతోపాటు ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు పరిశీలించారని, ఇప్పుడు మండల స్థాయి వెరిఫికేషన్ ఆఫీసర్లు పరిశీలించాలన్నారు. వెరిఫికేషన్ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని, ఏమైనా సందేహాలుంటే  ఎంపీడీవో, హౌసింగ్ పీడీల ద్వారా  నివృత్తి చేసుకోవాలన్నారు. హనుమకొండ గృహ నిర్మాణ శాఖ అధికారి రవీందర్ మాట్లాడుతూ దరఖాస్తుదారుల అర్హతలు పరిశీలించి ఇందిరమ్మ ఇండ్ల పథకానికి తుది జాబితాను రెడీ చేయాలని సూచించారు.  

గన్నీ బ్యాగులు అందుబాటులో ఉండాలి

జిల్లాలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సరిపడా గన్నీ బ్యాగులు, టార్పాలిన్ కవర్లు సిద్ధంగా ఉంచాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య ఆఫీసర్లను ఆదేశించారు. కలెక్టరేట్ లో ధాన్యం కొనుగోలు నిర్వహణ, కేంద్రాల వద్ద వసతులు, ఇతర అంశాలపై రివ్యూ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అకాల వర్షాలు పడే ఛాన్స్​ఉందని, కేంద్రాల వద్ద టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు.

ఏవైనా ఇబ్బందులుంటే  తన దృష్టికి తీసుకోవాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి, డీఆర్డీవో మేన శ్రీను, డీఏవో రవీందర్ సింగ్, డీసీవో సంజీవరెడ్డి, డీసీఎస్​వో కొమరయ్య, సివిల్​ సప్లయిస్​డీఎం మహేందర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.